ఇష్టారాజ్యంగా దర్శనానికి అనుమతులు
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:40 AM
తొలేళ్ల ఉత్సవం ప్రారంభం కాకముందే పైడిమాంబ దర్శనానికి పైరవీల పెత్తనం ఎక్కువ అవుతున్నది. ఆల య ప్రధాన ద్వారం వద్ద ప్రముఖుల దర్శనం కోసం వీఐపీ గేటు ఏర్పాటు చేశారు.
విజయనగరం కల్చరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తొలేళ్ల ఉత్సవం ప్రారంభం కాకముందే పైడిమాంబ దర్శనానికి పైరవీల పెత్తనం ఎక్కువ అవుతున్నది. ఆల య ప్రధాన ద్వారం వద్ద ప్రముఖుల దర్శనం కోసం వీఐపీ గేటు ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ గేటులో వీఐపీల సంగతి ఎలా ఉన్నా, అనధికారంగా చాలా మంది ఆ గేటు నుంచే వెళ్లారు. అమ్మవారి ఆలయం ఎడమవైపున క్యూ లైను ముందు కూడా ఒక గేటు ఏర్పాటు చేశారు. ఈ గేటులో కూడా చాలా మంది భక్తులను పంపించారు. అలాగే ఆలయం వెనుక భాగం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి చాలా మందిని అనుమతించడంతో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
దేవదాయ శాఖ సహాయ కమిషనర్, ఇన్‌చార్జి ఆలయ ఈవో కె.శీరిషా ఆదివారం ఈవో కార్యాలయం లో నుంచి అమ్మవారి దర్శనాల క్యూలైన్లను సీసీ ఫుటేజీ లో పర్యవేక్షించారు. అనధికారికంగా ఎవరినీ ఆలయం వెనుక గేటు నుంచి, వీఐపీ గేటు నుంచి అనుమతించ వద్దని సిబ్బందిని ఆదేశించారు. వెనుక గేటు నుంచి పంపిన వ్యక్తులను పిలిచి మందలించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె ఆలయ అధికారులకు సూచించారు.