జీడి పండ్లను పంపేందుకు అనుమతి ఇవ్వాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:21 PM
అధిక పోషక విలువలు కలిగిన జీడి పండ్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపించేందుకు అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరారు.
- పోలమాంబ జాతరకు నిధులు మంజూరు చేయాలి
- సీఎం సదస్సులో కోరిన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అధిక పోషక విలువలు కలిగిన జీడి పండ్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపించేందుకు అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరారు. బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 70 వేల ఎకరాల్లో జీడి పంట సాగులో ఉందని తెలిపారు. జీడి పప్పును మాత్రమే తీసుకొని అధిక పోషక విలువలు కలిగిన పండ్లను ఎవరూ తీసుకోవడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషక విలువలు కలిగిన జీడి పండును తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని నియంత్రించడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. రాష్ట్రవాప్తంగా జీడి పండ్లను పంపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానికంగా లభ్యమయ్యే సీజనల్ పండ్లను పిల్లలకు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని, ఇందుకు కూడా అనుమతి మంజూరు చేయాలని కలెక్టర్ విన్నవించారు. జీడి పండ్లలో పోషక విలువలను పరీక్షించి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యానవనశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో సమక్క, సారక్క జాతర మాదిరిగా మన్యం జిల్లాలో పోలమాంబ జాతరకు అంత ప్రాముఖ్యత ఉందని, దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారని, కానీ నిర్వహణకు నిధులు మంజూరు కావడం లేదని కలెక్టర్ సీఎంకు తెలిపారు. ఆయన స్పందిస్తూ దేవదాయశాఖ నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.
‘ముస్తాబు’ అద్భుతం
మన్యం జిల్లాలో అమలవుతున్న ‘ముస్తాబు’ కార్యక అద్భుతమని, దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మన్యం జిల్లాలో చేపట్టిన విధానాన్ని, మార్గదర్శకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముస్తాబు కార్యక్రమం తీరును సీఎంకి వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపం కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిపారు. ఆహారం తినే ముందు చేతులను పరిశుభ్రం చేసుకోవాలనే ఉద్దేశంతో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో పూర్తిస్థాయిలో ముస్తాబు అయ్యేలా ఆలోచన చేసినట్టు వివరించారు. దీని ద్వారా ప్రతి తరగతి ముందు సబ్బు, బకెట్‌తో నీరు, అద్దం, దువ్వెన, తువ్వాలు వంటివి ఏర్పాటు చేశామన్నారు. ప్రతి తరగతికి ఇద్దరు లీడర్లు ఉంటారని, వీరు తరగతి విద్యార్థులందరూ తల, చేతులను శుభ్రం చేసుకున్నారా? లేదా? పరిశీలించి లోపలకు పంపించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయాలతో విద్యార్థుల్లో అనారోగ్య సమస్యలు లేవని, సీజనల్ జ్వర పీడితులు కూడా ఒక రోజులో రికవరీ అవుతున్నట్లు వివరించారు.
కలెక్టర్‌ను అభినందించిన డిప్యూటీ సీఎం
కేంద్ర ప్రభుత్వ పథకాలను నూటికి నూరు శాతం జిల్లాలో అమలు చేస్తున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డిని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అభినందించారు. బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించడంలో ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్లను కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలో అమలు చేయడంలో ముందంజలో ఉన్న జిల్లా కలెక్టర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.