Share News

Akshara Andhra పక్కాగా అక్షరాంధ్ర

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:34 AM

Perfectly Akshara Andhra జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

  Akshara Andhra పక్కాగా అక్షరాంధ్ర
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ‘జిల్లాలో అక్షరాస్యత 57 శాతంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో సుమారు 44 శాతం మాత్రమే ఉంది. ఈ ఏడాది 65,011 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. వయోజన విద్య కింద సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నిరక్షరాస్యులకు రోజూ ఒక గంట పాటు అక్షరజ్ఞానం కల్పించాలి. ఫైనాన్షియల్‌, డిజిటల్‌ లిటరసీపై అవగాహన కల్పించాలి. స్థానికంగా ఉండి కనీస విద్యార్హత ఉన్నవారిని ట్యూటర్‌గా నియమించుకోవాలి. ముందుగా కేంద్రానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించాలి. ప్రతి కేంద్రం వద్ద ఫ్లెక్సీ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా, ఐసీడీఎస్‌ శాఖలు భాగస్వాములవ్వాలి. మండల ప్రత్యేకాధికారులు తప్పనిసరిగా కేంద్రాలను సందర్శించి వయోజన విద్య తీరు తెన్నులను పరిశీలించాల్సి ఉంది. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీల పరిష్కారంలో నాణ్యత పాటించడం లేదు. దీంతో అవే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఇకపై అలా జరగకూడదు. ఇందుకోసం ప్రతి శాఖలో పీజీఆర్‌ఎస్‌ కోసం నియమించిన ప్రతినిధి రెండు వారాల పాటు కలెక్టరేట్‌లో శిక్షణ పొందాలి.’ అని కలెక్టర్‌ తెలిపారు. పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలో వీధిలైట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ట్రాన్స్‌పోర్టు అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

Updated Date - Aug 19 , 2025 | 12:34 AM