Share News

Vision Plan పక్కాగా విజన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:42 PM

Perfect Vision Plan జిల్లాలో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గాల విజన్‌ ప్లాన్‌ను పక్కాగా రూపొందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ సూచించారు. వృద్ధిరేటు వాస్తవానికి దగ్గరగ ఉండాలని తెలిపారు.

  Vision Plan పక్కాగా విజన్‌ ప్లాన్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గాల విజన్‌ ప్లాన్‌ను పక్కాగా రూపొందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ సూచించారు. వృద్ధిరేటు వాస్తవానికి దగ్గరగ ఉండాలని తెలిపారు. స్వర్ణాంధ్ర-2047 కెపాసిటీ బిల్డింగ్‌పై బుధవారం విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇప్పటికే జిల్లాకు సంబంధించి డ్రాఫ్ట్‌ ప్లాన్‌ను రూపొందించాం. శాసనసభ నియోజకవర్గాల వారి ప్రణాళికలను రూపొందించాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి. ముఖ్యంగా జిల్లాల భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఏడాది 16.12 శాత వృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలి. తద్వారా తలసరి ఆదాయం రూ.1,94,048 అంచనా వేయాలి. ముఖ్యంగా జిల్లాలో ప్రాథమిక రంగం నుంచే 49.27 శాతం, 41.64 శాతం సేవా రంగాలు, 9.09 శాతం పారిశ్రామిక రంగం నుంచి వృద్ధి ఉండబోతోంది. ఉద్యాన పంటల సాగు విస్తరణ, పశు పెంపకం తదితర చర్యలతో గణనీయంగా పురోగతి సాధించొచ్చు.’ అని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రణాళికాశాఖ రిటైర్డ్‌ డైరెక్టర్‌, సలహాదారు సీతాపతిరావు, మూడు జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులు పి.బాలాజీ, పి.వీర్రాజు, లక్ష్మీప్రసన్న, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, పర్యవేక్షణ బృందం సభ్యులు పాల్గొన్నారు.

సమస్యలను అధిగమించి రీసర్వే చేపట్టాలి

సాంకేతిక సమస్యలను అధిగమించి రీసర్వే 2.0 చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో రీసర్వే వేగవంతం చేయాలన్నారు. తొలిసారి నిర్వహించిన ప్రక్రియలో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. సాంకేతిక సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వెబ్‌ల్యాండ్‌ విషయమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, ఉప కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:42 PM