Share News

Pension for all... no tension అందరికీ పింఛన్‌... నో టెన్షన్‌

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:21 AM

Pension for all... no tensionసామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 1న(సోమవారం) జిల్లాలో అందరికీ పింఛన్లు అందించేందుకు నిర్ణయించింది.

Pension for all... no tension అందరికీ పింఛన్‌... నో టెన్షన్‌

అందరికీ పింఛన్‌... నో టెన్షన్‌

ఏ ఒక్కరినీ తొలగించ లేదు

2,74,186 మందికి నేటి నుంచి పంపిణీ

రూ.116.10 కోట్లు మంజూరు

సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 1న(సోమవారం) జిల్లాలో అందరికీ పింఛన్లు అందించేందుకు నిర్ణయించింది. ఇటీవల దివ్యాంగులకు సంబంధించి 40 శాతం కంటే వైకల్య శాతం తక్కువ ఉన్నవారికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో అర్హులు ఉంటే వైకల్య నిర్ధారణకు అప్పీల్‌ చేసుకునే వెసులబాటు కూడా ఇచ్చింది. ఇంతలో ప్రతిపక్ష నాయకులు రంగంలోకి దిగి పింఛన్లను ప్రభుత్వం తొలగిస్తోందంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో పింఛన్ల విషయంలో ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. నోటీసులను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఎప్పటిలా అందరికీ పింఛన్లు అందజేస్తామని చెప్పింది.

విజయనగరం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా 6,770 మంది దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారులకు అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసులు ఉపసంహరించుకొని జిల్లాలో సోమవారం నుంచి అందరికీ పింఛన్లు అందించనున్నట్టు అధికారులు తాజాగా ప్రకటించారు. ఆగస్టు నెలకు సంబంధించి 2,74,186 మంది సామాజిక పింఛన్‌ లబ్ధిదారులకుగాను రూ.116.10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మండలాల వారీగా బ్యాంక్‌లకు ఈ మొత్తాలను డీఆర్‌డీఏ విడుదల చేసింది. సచివాలయాల సంక్షేమ అధికారులు శనివారమే ఈ నిధులను విత్‌డ్రా చేశారు. సోమవారం పంపిణీ చేయనున్నారు. గత నెలలో జిల్లాలో 2,74,801 మందికి పింఛన్లు అందించారు. గత నెలతో పోల్చితే 615 పింఛన్లు తగ్గాయి కానీ ఇవి తొలగించినవి కాదని చనిపోయిన వారివి అని అధికారులు తెలిపారు.

సామాజిక పింఛన్ల పెంపు ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. దివ్యాంగులకు సంబంధించి మూడు విభాగాల్లో రూ.6, రూ.10, రూ.15 వేలు అందిస్తోంది. వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళలకు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు తదితర విభాగాల వారికి రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కండరాల బలహీనత, పక్షవాతం తదితర రుగ్మతలతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురై మంచం పట్టిన వారికి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో మంచానికే పరిమితమైనవారు 342 మంది ఉన్నారు. వీరి ఇంటికి వెళ్లి వైద్య బృందం ఇప్పటికే తనిఖీలు పూర్తిచేసింది. జిల్లాలో రూ.6 వేలు పింఛన్‌ మొత్తాన్ని అందుకుంటున్న దివ్యాంగుల సంఖ్య 36,974. అయితే వీరి వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో 40 శాతం కంటే తక్కువ వైకల్య శాతం ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. మరోసారి వీరికి నిర్ధారణ పరీక్షలు చేసి.. అనర్హులు, బోగస్‌ ధ్రువపత్రాలతో పింఛన్‌ పొందుతున్న వారిని తొలగించనున్నారు.

తప్పుడు ధ్రువపత్రాలతో..

జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల సామాజిక పింఛన్‌ లబ్ధిదారులు 2,74,801 మంది ఉన్నారు. అయితే చాలామంది తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్టు తేలింది. ముఖ్యంగా ఆధార్‌లో తప్పుడు వయసు చూపి చాలా మంది పింఛన్లు పొందుతున్నారు. వైసీపీ హయాంలో చోటా నేతలే సదరం సర్టిఫికెట్ల విషయంలో సూత్రధారులుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు వైద్యాధికారులతో కుమ్మకై లబ్ధిదారుల వద్ద వేలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. కాగా కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఈ బోగస్‌ పింఛన్లకు బ్రేక్‌ పడకపోవడంపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదులూ అందాయి. అయితే దివ్యాంగులకు సంబంధించి బోగస్‌ విషయంలో తేల్చడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అందించిన నోటీసులపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉండగా నోటీసులందించిన వారికి రెండు నెలల తరువాత మరోసారి నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్టు తెలుస్తోంది. అందులో 40 శాతంకంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే కొనసాగిస్తారు. లేకుంటే మాత్రం తొలగిస్తారు.

- బొబ్బిలి మండలం మెట్టవలస సచవాలయ పరిధిలో ఇది వరకు 536 మంది పింఛన్లు పంపిణీ జరిగేవి. వీరిలో 26 మందికి నోటీసులిచ్చారు. వారు అప్పీలు చేసుకున్నారు. అయితే ఎవరినీ తొలగించలేదు. శనివారం 536 మందికీ పింఛన్‌ నగదును బ్యాంకు నుండి డ్రా చేశామని పంచాయతీ కార్యదర్శి శ్రీహరి తెలిపారు.

ఎవరినీ తొలగించలేదు

జిల్లాలో ఎటువంటి పింఛన్ల తొలగింపు లేదు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అనర్హత పింఛన్ల విషయం తేల్చేందుకే నోటీసులిచ్చాం కానీ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకుంది. అందుకే సెప్టెంబరు నెలకు సంబంధించి అందరికీ పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా సోమవారం పింఛన్ల పంపిణీ జరగనుంది.

- శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ, విజయనగరం

వైసీపీ నాయకులది తప్పుడు ప్రచారం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

జిల్లాలో ఎవరి పింఛనూ తొలగించలేదు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందరికీ పింఛన్‌ డబ్బులు సోమవారం అందిస్తున్నాం. వైసీపీ నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మవద్దు. కూటమి ప్రభుత్వంలో పింఛన్‌లు ఇవ్వడం తప్ప తీసేయడం ఎక్కడా లేదు.

-----------------

Updated Date - Sep 01 , 2025 | 12:21 AM