Pension Distribution యథావిధిగానే పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:26 PM
Pension Distribution as Usual జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగానే లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్ము అందజేయ నున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎటువంటి మార్పులు లేవని అధికారుల వెల్లడి
గరుగుబిల్లి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగానే లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్ము అందజేయ నున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 7,500 దివ్యాంగ పింఛన్లను గతంలో పునఃపరిశీలించారు. అయితే వైకల్య శాతం తక్కువగా ఉన్నవారికి పింఛన్లు నిలుపుదల చేయనున్నట్లు గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయా పింఛన్‌దారులు ఆందోళన చెందారు. అయితే ఆగస్టులో దివ్యాంగులందరికీ ప్రభుత్వం పింఛన్లు అందించింది. కాగా ఈ నెలలో పింఛన్లు ఇస్తారో లేదోనని కొంతమంది టెన్షన్ పడ్డారు. అయితే యథావిధిగా దివ్యాంగులందరికీ పింఛన్ల సొమ్ము అందించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1,40,401 మంది పింఛన్‌దారులకు రూ. 50.91 కోట్లను విడుదల చేసింది. మండలాల పరిధిలోని సచివాలయాల సిబ్బందికి ఆ మొత్తాలను జమ చేశారు. బుధవారం నిర్దేశించిన సమయంలోగా వారు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించనున్నారు.
అసౌకర్యం కలగకుండా ...
జిల్లాలో పింఛన్‌దారులకు అసౌకర్యం కలగకుండా పింఛన్లు పంపిణీ చేపట్టనున్నాం. పంపిణీలో ఎటువంటి మార్పులు లేవు. దివ్యాంగులందరికీ పింఛన్ సొమ్ము అందిస్తాం. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నూతన పింఛన్లు మంజూరు కాలేదు.
- ఎం.సుధారాణి, పీడీ, డీఆర్‌డీఏ, పార్వతీపురం