Pending Salaries వేతన బకాయిలు రూ.16 కోట్లు
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:56 PM
Pending Salaries Amount to ₹16 Crore ఉపాధి హామీ పథకం వేతనదారులకు కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా పనులు పూర్తి చేసినా వేతనాలు అందకపోవడంపై మరికొందరు పెదవి విరుస్తున్నారు.
ఆందోళనలో ఉపాధి హామీ పథకం కూలీలు
పూర్తయిన అభివృద్ధి పనులకూ అందని బిల్లులు
పార్వతీపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం వేతనదారులకు కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా పనులు పూర్తి చేసినా వేతనాలు అందకపోవడంపై మరికొందరు పెదవి విరుస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో 1,92,000 జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిల్లో 1,68,000 కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 15 తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారు రూ.16 కోట్ల వరకు వేతన బకాయిలున్నాయి. వాటిని ఇప్పటివరకు చెల్లించకపోవడంపై వేతనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. సీసీ, బీటీ రహదారులు, కాంపౌండ్ వాల్స్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు సుమారు రూ.56 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
త్వరలోనే చెల్లింపులు
ఉపాధి పనులు చేపట్టిన వేతనదారులకు మరో రెండు మూడు రోజుల్లో చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. నిధులు వచ్చిన వెంటనే బిల్లులు చెల్లిస్తాం. మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులకు కూడా త్వరలో చెల్లిస్తాం.
- కె.రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం