Share News

Pass even if don't go to class క్లాసుకు వెళ్లకున్నా పాస్‌

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:19 PM

Pass even if don't go to class జిల్లాలో కొన్ని కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులో చేరితే తరగతికి హాజరుకానవసరం లేదు. పైగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజం. వృత్తి విద్యా శాఖ నుంచే ఆయా కళాశాలలకు పరోక్ష సహకారం అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Pass even if don't go to class క్లాసుకు వెళ్లకున్నా పాస్‌

క్లాసుకు వెళ్లకున్నా పాస్‌

ప్రైవేటు ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల మాయాజాలం

పరోక్షంగా అందుతున్న వృత్తి విద్యాశాఖ సహకారం

సొంత కళాశాలల్లోనే ప్రాక్టికల్స్‌

- ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో ఎస్‌.కోట పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరుగుతున్న ఇంటర్‌ ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖకు చెందిన అధికారొకరు వచ్చారు. వేరే పరీక్ష కేంద్రంలో ఉండాల్సిన ఇన్విజిలేటర్‌ ఈ ప్రైవేటు కళాశాలలో కనిపించారు. నువ్వేంటి ఇక్కడున్నావని ఆ అధికారి అడిగారు. ఇన్విజిలేటర్‌ ఓ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఇక్కడి ప్రత్యేక అధికారికి చమటలు పట్టాయి. చర్యలు తీసుకుంటారేమోనని భయపడ్డారు. ఆ తర్వాత ఇదేమంత పెద్ద విషయం కాదనుకున్నారో, తమ వంతుగా సహకారమందించారో తెలియదుకాని పరీక్ష మాత్రం సాఫీగా జరిగిపోయింది. ఇదే పరీక్ష కేంద్రంలో ప్రాక్టికల్‌ పరీక్ష రాయాల్సిన విద్యార్థికి బదులు వేరొకరిని కూర్చోబెట్టి రాయించినా పట్టించుకోలేదు. చివరికి ఈ పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థులంతా మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

శృంగవరపుకోట, నవంబరు11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కొన్ని కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులో చేరితే తరగతికి హాజరుకానవసరం లేదు. పైగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజం. వృత్తి విద్యా శాఖ నుంచే ఆయా కళాశాలలకు పరోక్ష సహకారం అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లోనే ప్రాక్టికల్స్‌ జరుగుతుండడంతో యాజమాన్యాలు ఏం చెబితే అదే జరుగుతోంది. ఇటు విద్యార్థులు కూడా ఉత్తీర్ణత శాతాన్ని మాత్రమే చూస్తూ ఆయా కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.

తరగతులకు వచ్చినా, రాకపోయినా పాస్‌ చేయిస్తామన్న హామీతోనే ఆ కళాశాలలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. పరీక్షల సమయంలో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. పరీక్షల్లో చూసి రాయించేందుకు సబ్జెక్టుకో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్మును ఈ పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఇన్విజిలేటర్లకు పంచుతున్నారు. వీరంతా పరీక్షల సమయంలో చూసీచూడనట్లు వ్యవహ రిస్తున్నారు. ఇలాంటి యాజమాన్యాలకు పరోక్షంగా సహకారం అందిస్తుండంతో నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్న కళాశాలలకు నష్టం జరుగుతోంది. చూసిరాయించే కళాశాలల్లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగింది. బాగా చదవుకుంటున్నవారు ఇంజనీరింగ్‌, వైద్య, వ్యవసాయం, వెటర్నరీ వంటి విద్యను అభ్యసించేందుకు చూస్తున్నారు. కాస్త అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు సాధారణ ఇంటర్‌, డిగ్రీ చదివి ఖాళీగా ఉండేకంటే వృత్తి విద్యాకోర్సులు నేర్చుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ముందుకు రావడంతో ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల సంఖ్య పెరుగుతోంది. అయితే వీటిల్లో చేరేవారిలో అత్యధిక శాతం మంది అప్పటికే ఆసుపత్రుల్లో నర్సులుగాను, ల్యాబ్‌ టెక్నీషయన్‌లుగాను, వెటర్నరీ అసిస్టెంట్‌లుగా ఎక్కడో ఒక చోట పని చేస్తున్నారు. వీరు రోజూ కళాశాల తరగతులకు హాజరుకాలేరు. ఇలాంటి వారంతా కొన్ని ఒకేషనల్‌ కళాశాలలకు వరంగా మారారు. తరగతులకు హాజరుకాకున్నా పాస్‌ గ్యారంటీ అంటూ కళాశాలల యాజమాన్యాలు హామీ ఇస్తున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం పరీక్షల సమయంలో మాస్‌ కాపీయింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాలేని విద్యార్థికి బదులు ఓ తెలివైన విద్యార్థితో పరీక్ష రాయించేస్తున్నారు.

ఆయా కళాశాలల్లో పాఠ్యాంశాలు బోధించేందుకు అధ్యాపకులు కూడా ఉండరు. ఒకరిద్దరు అధ్యాపకులను చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో జంబ్లింగ్‌ విధానం (ఒక కళాశాల విద్యార్థులు మరో కళాశాలలో)లో పరీక్షలు నిర్వహించేవారు. అప్పట్లో కొన్ని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇచ్చుపుచ్చుకోనే ధోరణి అవలంభించినప్పటికీ ఎంతోకొంత మాస్‌ కాపీయింగ్‌కు అడ్డుకట్టపడేది. వైసీపీ ప్రభుత్వం దీన్ని తొలగించింది. మూడేళ్లగా సొంత కళాశాలల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఏ కళాశాలలో చదివే విదార్థి అదే కళాశాలలో పరీక్ష రాస్తున్నాడు. కొన్ని యాజమాన్యాలకు ఇది కలిసొస్తోంది. ఏటా విద్యార్థుల చేరికలు పెరిగేందుకు ఉపయోగపడుతోంది.

-------------------------

Updated Date - Nov 11 , 2025 | 11:19 PM