Share News

పంచాయతీలు ప్రక్షాళన

ABN , Publish Date - May 24 , 2025 | 11:28 PM

పంచాయతీల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.క్లస్టర్‌ విధానానికి స్వస్తి పలికి గ్రేడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది.

   పంచాయతీలు ప్రక్షాళన
కురుపాం పంచాయతీ వ్యూ

- క్లస్టర్‌ విధానానిని స్వస్తి

- గ్రేడ్‌ విధానం అమలు

- జిల్లాలో 450 పంచాయతీలు

- ఎక్కువగా గ్రేడ్‌-3 కేటాయించే అవకాశం

పార్వతీపురం, మే 24 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్లస్టర్‌ విధానానికి స్వస్తి పలికి గ్రేడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది. గతంలో ఒక క్లస్టర్‌లో రెండు లేదా మూడు పంచాయతీలు ఉండేవి. తాజాగా జనాభా, వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని పంచాయతీలను గ్రేడ్లగా విభజించనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో 15 మండలాల్లో 450 పంచాయతీలు ఉన్నాయి. పాత లెక్కల ప్రకారం ఇందులో గ్రేడ్‌-5లో 170, గ్రేడ్‌-2లో మూడు, గ్రేడ్‌-1లో రెండు పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం క్లస్టర్‌లో మేజర్‌ పంచాయతీలు, మైనర్‌ పంచాయతీల వ్యవస్థ నడుస్తుంది. రెండు లేదా మూడు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఒక కార్యదర్శిని నియమించి పాలన సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇకపై జనాభా, ఆదాయం ఆధారంగా పంచాయతీలకు గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఆదర్శ పంచాయతీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గ్రేడ్‌ విధానంలో సచివాలయ సిబ్బందిని అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు కసరత్తు ప్రారంభించారు.

గ్రేడ్ల కేటాయింపు ఇలా..

10 వేల జనాభా లేదా ప్రభుత్వ గ్రాంట్లు కాకుండా కోటి రూపాయల ఆదాయం వచ్చే పంచాయతీలకు ప్రత్యేక గ్రేడ్‌ కేటాయించనున్నారు. వీటికి ఈవోపీఆర్‌డీలను పంచాయతీ అధికారులుగా నియమిస్తారు. వీరిని డిప్యూటీ ఎంపీడీవోలుగా పిలవనున్నారు. వీటి పరిధిలోకి మేజర్‌ పంచాయతీలను తీసుకురానున్నారు. -4 వేల నుంచి 10 వేల మధ్య జనాభా లేదా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం ఉండే పంచాయతీలను గ్రేడ్‌-1గా ఎంపిక చేయనున్నారు. మండల కేంద్రాలుగా ఉండే పంచాయతీలను వీటి పరిధిలోకి తీసుకురానున్నారు. - రెండు వేల నుంచి నాలుగు వేల మధ్య జనాభా గల పంచాయతీలను గ్రేడ్‌-2 గా పరిగణిస్తారు. - రెండు వేలు కన్నా తక్కువ జనాభా ఉండే పంచాయతీలను గ్రేడ్‌-3 పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ విధంగా జిల్లాలోని పంచాయతీలను జనాభా, అదే విధంగా ఆదాయం పరిగణలోనికి తీసుకుని గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన పంచాయతీలు ఉండడంతో ఇవన్నీ గ్రేడ్‌-3లోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పంచాయతీల్లో రెండు వేలు కన్నా తక్కువ జనాభా ఉన్నారు.

నివేదిక అందిస్తాం

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంచాయతీలను మూడు గ్రేడ్‌లుగా విభజిస్తాం. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందిస్తాం. తర్వాత పంచాయతీలకు గ్రేడ్లు ప్రకటిస్తాం.

-కొండలరావు, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - May 24 , 2025 | 11:28 PM