Paga in Gurla Gedda Reservoir lands గుర్ల గెడ్డ రిజర్వాయర్ భూముల్లో పాగా
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:56 PM
Paga in Gurla Gedda Reservoir lands దశాబ్దాల కిందట తెరపైకి వచ్చిన గుర్లగెడ్డ మినీరిజర్వాయర్ నేటికీ నిర్మాణం పూర్తికాకపోగా వాటి భూములతో మాత్రం కొందరు వ్యాపారం చేస్తున్నారు. రిజర్వాయర్ భూములుగా మ్యుటేషన్ కాని పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇప్పటికే మూడు చేతులు మారాయని సమాచారం. మూడో వ్యక్తి ఇటీవల రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న భూముల్లో చదును చేయడంతో విషయం బయటకు పొక్కింది. రైతు సంఘాలు కూడా కన్నెర్ర చేస్తున్నాయి.
గుర్ల గెడ్డ రిజర్వాయర్ భూముల్లో
పాగా
ప్రాజెక్టు భూములుగా మ్యుటేషన్ చేయని వైనం
ఇప్పటికీ రికార్డుల్లో రైతులపేర్లే
పరాధీనం అవుతున్న భూములు
పెద్దఎత్తున చేతులుమారిన వైనం
వామపక్ష, రైతుసంఘాలు కన్నెర్ర
దశాబ్దాల కిందట తెరపైకి వచ్చిన గుర్లగెడ్డ మినీరిజర్వాయర్ నేటికీ నిర్మాణం పూర్తికాకపోగా వాటి భూములతో మాత్రం కొందరు వ్యాపారం చేస్తున్నారు. రిజర్వాయర్ భూములుగా మ్యుటేషన్ కాని పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇప్పటికే మూడు చేతులు మారాయని సమాచారం. మూడో వ్యక్తి ఇటీవల రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న భూముల్లో చదును చేయడంతో విషయం బయటకు పొక్కింది. రైతు సంఘాలు కూడా కన్నెర్ర చేస్తున్నాయి.
మెంటాడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి):
మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ మినీరిజర్వాయర్ భూములు పెద్దమనుషులకు పప్పుబెల్లాలవుతున్నాయి. సుమారు పాతికేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 203 ఎకరాలను సేకరించింది. ఇందులో 138 ఎకరాలు ప్రభుత్వానివి కాగా 65 ఎకరాలు ప్రైవేటు భూమి. రైతుల నుంచి సేకరించిన ఈ భూములను రిజర్వాయర్ భూములుగా మ్యుటేషన్ చేయలేదు. దీంతో అవి రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ రైతులపేర్లు మీదే ఉండడంతో క్రమక్రమంగా పరాధీనమవుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు చేతులు మారగా మూడోవ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమిలో కొంతమేర ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించాడు. ఆ సంస్థ అక్కడ పనులు కూడా ప్రారంభించింది.
రైతుల నుంచి కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయని చెబుతున్న మూడో వ్యక్తి.. రిజర్వాయర్ స్థలాన్ని ఆనుకొని చదునుచేయడంతో విషయం బయటకు పొక్కింది. ఆ భూమిని కూడా తనభూమిలో కలిపేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వాయర్ భూములు ఇలా అన్యాక్రాంతమవడంతో కొన్నాళ్ళకు రిజర్వాయర్ ఉనికికే ముప్పు వాటిల్లేలా ఉందన్న వామపక్ష, ప్రజా, రైతుసంఘాలు ఆందోళన బాట పట్టాయి. తక్షణమే విచారణ జరిపి రిజర్వాయర్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఫ మెంటాడ, ప్రస్తుత అల్లూరి జిల్లా అనంతగిరి మండలాల సరిహద్దుల్లో ఉన్న సుమారు పది గ్రామాలకు చెందిన దాదాపు మూడువేల ఎకరాల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో 2000 సంవత్సరంలో రూ.4.28కోట్ల అంచనా వ్యయంతో గుర్లగెడ్డ రిజర్వాయర్ నిర్మాణం చేయదలిచారు. నిర్మాణం నిమిత్తం సుమారు 203 ఎకరాలను సేకరించారు. ప్రాజెక్టు పనులు 80 శాతం మేర పూర్తయిన సమయంలో అటవీశాఖ అభ్యంతరాలతో నాటినుంచి అసంపూర్తిగా నిలిచిపోయింది.
ఫ రైతుల నుంచి సేకరించిన భూములను ప్రభుత్వం రిజర్వాయర్ భూములుగా మ్యుటేషన్ చేసుకొని గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ జరగలేదు. అవి రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ రైతుల పేర్లుమీదే ఉన్నాయి. దీన్ని పసిగట్టిన కొందరు వ్యాపారులు ఈ భూములపై కన్నేసి రైతులకు నచ్చజెప్పి ఎంతోకొంత ముట్టజెప్పి తమపేర్లుమీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పరిపాటిగా మారింది. చాలా భూమి ఇప్పటికి ముగ్గురు చేతులు మారిపోయింది.
సర్ప్రస్ వీల్ ఆనుకొని చదును
రెండోవ్యక్తి నుంచి కొన్నాళ్ళ క్రితం సుమారు 40 ఎకరాల మేర కొనుగోలు చేసిన విజయనగరానికి చెందిన వ్యక్తి, ఐదెకరాలను ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించాడు. సర్ప్రస్ వీల్‌కు ఆనుకొని ఉన్న భూమిని చదును చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీనిపై గుర్ల రిజర్వాయర్ ఇరిగేషన్ జేఈ నవీన్ ఏఎస్‌ఆర్ జిల్లా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
వామపక్షాల ఆందోళన బాట
రిజర్వాయర్ భూముల కొనుగోలు చేసింది చాలక సర్ప్రస్ వీల్‌కు ఆనుకొని చదును చేయడంపై స్థానిక వామపక్ష,రైతు,ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టాయి.కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఆక్రమణలు గుర్తించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.
రికార్డులు అందుబాటులో లేవు
ప్రాజెక్టు జేఈ నవీన్
గుర్ల మినీ జలాశయం కోసం సేకరించిన భూమి వివరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఏఎస్‌ఆర్ జిల్లా అనంతగిరి మండలాల పరిధిలో రిజర్వాయర్ కోసం భూములు సేకరించారు. రెండు మండలాల అధికారుల నుంచి సమాచారం అడిగాను. అలానే బొబ్బిలి భూసేకరణ అధికారులను కూడా సంప్రదించాను. మ్యూటేషన్ కాకపోవడంతో ఇంకా రైతుల నుంచి భూ బదలాయింపు జరగలేదు. ఎంతమంది రైతులకు పరిహారం చెల్లించారో ఇప్పుడే చెప్పలేం.