Share News

pacs not working గాజులరేగ పీఏసీఎస్‌ ఎందుకున్నట్టో!

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:41 AM

pacs not working పేరుకు పీఏసీఎస్‌(ప్రైమరీ అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ సొసైటీ). పాలక మండలి కూడా ఉంది. కానీ చాలా సంవత్సరాలుగా రైతులకు రుణాలిచ్చింది లేదు. అసలు ఆర్థిక లావాదేవీలే జరగడం లేదు. సిబ్బంది చూస్తే సీఈవో ఒక్కరే. అతనికీ రెండున్నరేళ్లుగా వేతనం అందడం లేదు. విజయనగరంలోని గాజులరేగ పీఏసీఎస్‌ దుస్థితిది.

pacs not working గాజులరేగ పీఏసీఎస్‌   ఎందుకున్నట్టో!
మూసి ఉన్న గాజులరేగ పీఏసీఎస్‌

గాజులరేగ పీఏసీఎస్‌

ఎందుకున్నట్టో!

చాలా సంవత్సరాల కిందటే లావాదేవీలు బంద్‌

పాలకమండలి ఉన్నా నిధులు సున్నా

రెండున్నరేళ్లుగా జీతానికి నోచని సీఈవో

విజయనగరం టౌన్‌, నవంబరు1(ఆంధ్రజ్యోతి): పేరుకు పీఏసీఎస్‌(ప్రైమరీ అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ సొసైటీ). పాలక మండలి కూడా ఉంది. కానీ చాలా సంవత్సరాలుగా రైతులకు రుణాలిచ్చింది లేదు. అసలు ఆర్థిక లావాదేవీలే జరగడం లేదు. సిబ్బంది చూస్తే సీఈవో ఒక్కరే. అతనికీ రెండున్నరేళ్లుగా వేతనం అందడం లేదు. విజయనగరంలోని గాజులరేగ పీఏసీఎస్‌ దుస్థితిది.

రైతులకు రుణాలతో పాటు వారి సంక్షేమాభివృద్ధికి పాటుపడేందుకు ఏర్పాటుచేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు జిల్లాలో కొన్నిచోట్ల బాగానే సేవలు అందిస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంలోని గాజులరేగ సంఘం మాత్రం పూర్తిగా మరుగున పడిపోయింది. దాదాపు ముఫ్పైఏళ్లుగా సేవలకు దూరమవుతూ వచ్చింది.

1990లో సుమారు రూ.1కోటి నిధులతో సంఘం మొదలైంది. మూడునాలుగేళ్ల తర్వాత నుంచే తిరోగమన బాట పట్టింది. అప్పటి సిబ్బంది, పాలకమండలి వైఫల్యంతో మరి కోలుకోలేదు. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు రుణమాఫీ కింద సుమారు.రూ.70లక్షలు ప్రకటించడంతో ఒక్కసారిగా లావాదేవీలు పడిపోయాయి. ఆ తర్వాత నూతనంగా డిపాజిట్ల సేకరణ జరగలేదు. రైతులకు రుణాలు మంజూరు చేయలేదు. దీనికి తోడు రుణం కింద ఇచ్చిన రూ.25లక్షలను రైతుల నుంచి సిబ్బంది వసూలు చేయలేకపోయారు. దీంతో సభ్యుల సంఖ్య 7,500 మంది రైతుల నుంచి మెల్లమెల్లగా 108కి పడిపోయింది. ఇటు డిపాజిట్‌లు లేక అటు రుణాలు మంజూరు కాక డీసీసీబీ నుంచి కూడా నిధులు రాక పూర్తిగా బ్యాంకు సేవలు స్తంభించిపోయాయి. స్థానిక రైతుల నమ్మకాన్నీ కోల్పోయింది.

జనవరి 31తో ముగియనున్న పాలక మండలి గడువు

వచ్చే ఏడాది జనవరి 31తో పాలకమండలి గడువు ముగుస్తుంది. ఆ తరువాత మళ్లీ రెన్యువల్‌ చేయడమో లేక నూతన పాలకమండలిని ఎన్నుకోవడమో చేయాలి. పాలకమండలి ఉన్నా బ్యాంకులో పైసా నిధులు లేకపోవడంతో బ్యాంకును అభివృద్ధి చేయలేని పరిస్థితి. ఒకవైపు డిపాజిట్‌లు లేక, మరోవైపు మెంబర్‌షిప్‌లు రాక, ఇంకోవైపు డీసీసీబీ నుంచిసహకారం లేక పీఏసీఎస్‌ను అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలో తెలియడం లేదంటూ పాలకమండలి సభ్యులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కోరాడ వెంకట్రావు ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అదితి సహకారంతో ఈఏడాది 800 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతులు మాత్రమే తీసుకువచ్చారు. వచ్చే ఏడాది జనవరి 31తో పాలకమండలి గడువు ముగియడంతో ఉన్న ఈ తక్కువ సమయంలో బ్యాంకును అభివృద్ధి చేస్తారా లేక వదిలేస్తారా అన్నది చూడాలి.

రెండున్నరేళ్లుగా జీతం లేదు

గాజులరేగ సహకార బ్యాంకు సీఈవోగా పనిచేస్తున్న తనకు రెండున్నరేళ్లుగా జీతం అందలేదని సీఈవో సత్యనారాయణ తెలిపారు. ఏటా ఆడిట్‌ జరుగుతున్నప్పుడు తన చేతిచమురు రూ.10వేలు అవుతోందని వాపోయారు. బ్యాంకులో తానొక్కడినే ఉన్నానని, సిబ్బంది ఎవరూ లేరని చెప్పారు. బ్యాంకు పరిస్థితిని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి బ్యాంకుకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు.

Updated Date - Nov 02 , 2025 | 12:41 AM