Share News

Fields Submerged ఉప్పొంగుతున్న గెడ్డలు..ముంపులో పొలాలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:05 AM

Overflowing Streams.. Fields Submerged ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ విరివిగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలకు వరద పోటెత్తుతోంది. అయితే ఇదే సమయంలో కొన్నిచోట్ల పంట పొలాలు ముంపు నుంచి తేరుకోవడం లేదు. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండడంతో వరిపైరు కుళ్లిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 Fields Submerged ఉప్పొంగుతున్న గెడ్డలు..ముంపులో పొలాలు
వంశధార వరదనీటిలో కీసర, కోసలి పంట పొలాలు

  • జలాశయాలకు వరద

  • నీటమునుగుతున్న ఖరీప్‌ పంటలు

  • ఆందోళనలో రైతులు

పాలకొండ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలోనూ విరివిగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలకు వరద పోటెత్తుతోంది. అయితే ఇదే సమయంలో కొన్నిచోట్ల పంట పొలాలు ముంపు నుంచి తేరుకోవడం లేదు. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండడంతో వరిపైరు కుళ్లిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రావాడగెడ్డ, జంపరకోటగెడ్డ, తంపర గెడ్డతో పాటు నాగావళిలో వరద ఉధృతి కారణంగా పాలకొండ-పార్వతీపురం మార్గంలోని వీపీరాజుపేట జంక్షన్‌ వద్ద వందలాది ఎకరాల తంపర భూములు చెరువులను తలపిస్తున్నాయి. తంపటాపల్లి, తుమ రాడ, వీపీరాజుపేట, బుక్కూరు, యరకారాయపురం, చిన్నమంగళాపురం, గొట్ట మంగళాపురం, పాలకొండలో సుమారు సుమారు 500 నుంచి 600 ఎకరాల్లోని వ్యవసాయ భూములు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. రావాడగెడ్డ గట్టు తెగిపోవడంతో గండి పడింది. దీంతో సమీప పంట పొలాల్లోకి చేరగా.. కొంతమేర ఇసుకమేటలు వేశాయి. భామిని మండలంలో వంశధార నదిలో నీటి ప్రవాహం పెరగడంతో కోసలి, కీసర, ఘనసర, లివిరి, బాలేరు, పసుకుడి తదితర గ్రామాలకు చెందిన తంపర భూములు వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. సింగిడి, బురుజోల గ్రామాల్లోని కొంతమేర ఖరీఫ్‌ పంట నీటమునిగింది. వీరఘట్టం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురపాం తదితర మండలాల్లోని తంపరభూములు కూడా ఇంకా నీటిలోనే ఉన్నాయి. వాటిని పరిశీలించి ఆదుకోవాలని ఆయా ప్రాంతాల రైతులు కోరుతున్నారు. దీనిపై పాలకొండ మండల వ్యవసాయాధికారి ప్రసాదరావును వివరణ కోరగా.. ‘వరదనీరు మళ్లించిన తర్వాత పంట పొలాలకు యూరియా, పొటాష్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇలా చేయడం ద్వారా పంట సాధారణ స్థితికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఖరీఫ్‌ పంట పొట్ట దశకు చేరుకోకపోవడంతో పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి లేదు.’ అని తెలిపారు.

Updated Date - Sep 16 , 2025 | 12:05 AM