Share News

Pension Transfers పింఛన్ల బదిలీకి అవకాశం

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:26 AM

Option for Pension Transfers ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒకపై లబ్ధిదారులు వారు కోరుకున్న చోటుకు పింఛను బదిలీ చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

 Pension Transfers పింఛన్ల బదిలీకి అవకాశం

లబ్ధిదారుల హర్షం

కొమరాడ, మార్చి10(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒకపై లబ్ధిదారులు వారు కోరుకున్న చోటుకు పింఛను బదిలీ చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాల ద్వారా ఈ సేవలను పొందొచ్చని వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సామాజిక పింఛన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ప్రతినెలా ఒకటో తేదీనే కూటమి ప్రభుత్వం పింఛన్ల నగదు అందిస్తోంది. నెలలో మొదటి తేదీ సెలవు రోజు అయితే ముందు నెల చివరి రోజే పింఛన్‌ అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలో దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు లబ్ధిదారులు వ్యయ ప్రయాసలకోర్చి సొంత గ్రామాలకు రావాల్సి వస్తుంది. వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పింఛన్ల బదిలీలకు అవకాశం కల్పించింది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 15 మండలాలు, రెండు పట్టణాలు, ఒక నగర పంచాయతీ పరిధిలో మొత్తంగా 1,39,908 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఎన్టీఆర్‌ భరోసా కింద ప్రతినెలా ప్రభుత్వం వివిధ రకాల సామాజిక పింఛన్లను అందిస్తోంది. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మూడు నెలలకు ఒకసారి పింఛన్‌ నగదు మొత్తం ఒకేసారి పొందే వెసులుబాటును కల్పించింది. తాజాగా పింఛన్ల బదిలీలు చేసుకొనేందుకు అవకాశాన్ని ఇవ్వడంతో దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేయాలి

-ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ బదిలీ చేయించుకోవాలనుకునే లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

- పింఛన్‌ వెబ్‌సైట్‌లో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఆప్షన్‌ ఇచ్చింది. ఇందులో పింఛన్‌ ఐడీ ఏ ప్రాంతం బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం చిరునామా ఇవ్వాలి.

- నివాసం ఉంటున్న జిల్లా, మండలం, గ్రామ సచివాలయం పేర్లు పొందుపరచాలి.

- ఈ నూతన విధానం పింఛన్‌దారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కొమరాడ ఎంపీడీవో మల్లికార్జునరావు తెలిపారు. ఇకపై ప్రతినెలా ఒకటో తేదీన స్వగ్రామాలకు రావాల్సిన అవసరం లేదని.. వారున్న చోటనే పింఛన్‌ నగదు పొందొచ్చని వెల్లడించారు.

Updated Date - Mar 11 , 2025 | 12:26 AM