మరో ఆరు రోజులే..
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:05 AM
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) గడువు ఈ నెల 23తో ముగియనుంది.
- ఈ నెల23తో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్ గడువు
- వినియోగించుకోవాలంటున్న అధికారులు
బొబ్బిలి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) గడువు ఈ నెల 23తో ముగియనుంది. మరో ఆరు రోజులే సమయం ఉండడంతో సంబంధిత భూయజమానులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నారు. ఈమేరకు సచివాలయాల పరిధిలో విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. సాఽధారణంగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మునిసిపాలిటీకి 14 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకుంటే సగం ఫీజు ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా లేఅవుట్లు, స్థలాలపై వారికి పూర్తిస్థాయి హక్కులు ఆటోమేటిక్‌గా దఖలు పడతాయి. బ్యాంకు రుణాలు పొందడానికి, ఇతరత్రా అధికారికమైన లావాదేవీలు నిర్వహించుకోవడానికి సంబంధిత ఆస్తిపై యజమానులకు ప్రభుత్వపరమైన హక్కులు సంక్రమిస్తాయి. జీవో నెంబరు 134 ప్రకారం 2025 జూన్ 30 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. లేఅవుట్‌లోని కనీసం ఒక ప్లాట్‌ను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉంది. బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలో 270 అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ఇందులో 229 లేఅవుట్లను అప్రూవ్ చేశారు. పది లేఅవుట్లకు సంబంధించి చెల్లింపులు జరిపారు. అనధికార ఇళ్లస్థలాలకు సంబంధించి 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. 45 రోజుల్లోగా పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే పదిశాతం, 90 రోజుల్లో 5 శాతం తగ్గింపు వర్తిస్తుంది. ఓపెన్ స్పేస్ లేనప్పుడు భూమి విలువపై 7 శాతం అదనపు చార్జీలు అంటే 14 శాతంలో సగం రాయితీ లభిస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్ సదుపాయాన్ని వినియోగించుకున్న వారికి సంబంధిత మునిసిపాలిటీల నుంచి ఎల్‌పీ నెంబరు జారీ అవుతుంది. దీనివల్ల స్థలాలు క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అడ్డంకులు తొలగిపోతాయి. ఆస్తివిలువ పెరిగి భద్రత లభిస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని పొందకుంటే ప్లాటు చట్టబద్ధం కాదు. భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వబడదు. ఆస్తి విలువ తగ్గడమే కాక, భవిష్యత్‌లో ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలను వాటి యజమానులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
-చామంతి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్, టౌన్‌ప్లానింగ్ శాఖ, విశాఖపట్నం