Only if industries open..! పరిశ్రమలు తెరిస్తేనే..!
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:32 PM
Only if industries open..! జిల్లాలో పరిశ్రమలు చాలావరకు మూతపడ్డాయి. ముడిసరుకుల లభ్యత తగ్గడం, వాటి ధర పెరగడం, విద్యుత్ చార్జీలు పెరగడం, గతంలో ఇచ్చిన రాయితీలను నిలిపివేయడం, నిర్వహణ ఖర్చు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం కారణంగా పరిశ్రమలు నష్టాల బాటలో నడిచాయి. దీంతో యాజమాన్యాలు లాకౌట్ ప్రకటించాయి. ఈ కారణంగా ఉత్పత్తులు నిలిచిపోయాయి. వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. కూటమి ప్రభుత్వంపై ఈ పరిశ్రమలను తెరించాల్సిన బాధ్యత ఉంది.
పరిశ్రమలు తెరిస్తేనే..!
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం
రోడ్లు నిర్మిస్తే గాడిలో పడనున్న మార్కెటింగ్, రవాణా
సీఎం చంద్రబాబుపైనే నిరుద్యోగుల ఆశలు
విజయనగరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమలు చాలావరకు మూతపడ్డాయి. ముడిసరుకుల లభ్యత తగ్గడం, వాటి ధర పెరగడం, విద్యుత్ చార్జీలు పెరగడం, గతంలో ఇచ్చిన రాయితీలను నిలిపివేయడం, నిర్వహణ ఖర్చు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం కారణంగా పరిశ్రమలు నష్టాల బాటలో నడిచాయి. దీంతో యాజమాన్యాలు లాకౌట్ ప్రకటించాయి. ఈ కారణంగా ఉత్పత్తులు నిలిచిపోయాయి. వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. కూటమి ప్రభుత్వంపై ఈ పరిశ్రమలను తెరించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం విద్యుత్‌తో పాటు ఇతరత్రా రాయితీలను ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాలు ఒక్కటే చాలవు. మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి.
ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలదీ అదే తీరు..
జిల్లాలో పది వరకు ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు నడిచేవి. ముడి సరుకు కొరత, విద్యుత్ చార్జీలు పెంపు తదితర కారణాలతో పరిశ్రమలు నిర్వహించలేక యాజమాన్యాలు చేతులెత్తేశాయి. నాలుగేళ్ల కిందట గర్భాం మండలంలోని ఆంధ్రా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ మూతపడింది. దీంతో దాదాపు 600 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. గత ఏడాది జూలైలో స్మెల్‌టెక్ పరిశ్రమ మూతపడడంతో మరో 200 మంది ఉపాధికి దూరమయ్యారు. వ్యవసాయ అనుబంధంగా నడిచే షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. జామి మండలం భీమసింగిలోని ప్రభుత్వ చక్కెర కర్మాగారాన్ని బాగుచేస్తామన్న నెపంతో ఐదేళ్ల కిందట మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెరవలేదు. అటు సీతానగరంలో ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారాన్ని సైతం మూసివేశారు. రైతులకు చెరకు బకాయిలు సైతం చెల్లించలేదు. గత ఐదేళ్లలో ఉన్న పరిశ్రమలు మూతపడగా కొత్త పరిశ్రమల జాడ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వీటన్నింటిపై దృష్టి పెట్టాలి.
రహదారులు అస్తవ్యస్తం
జిల్లాలో అంతర్రాష్ట్ర, జిల్లా రహదారులు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దారుణంగా తయారయ్యాయి. తగరపువలస-విజయనగరం-రాజాం రహదారి ప్రధానమైనది. ఐదేళ్లలో కనీస నిర్వహణ లేక అధ్వానంగా మారింది. దీన్ని పీపీపీ పద్ధతిలో పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చిలకపాలెం-రాజాం-జైపూర్ రోడ్డు.. అలికాం-పార్వతీపురం- రాయగడ రోడ్ల నిర్మాణంతోనే ఉమ్మడి జిల్లావాసుల కష్టాలు తీరుతాయి. జిల్లాలో 1505.64 కిలోమీటర్ల మేర అన్నిరకాల రహదారులు ఉన్నాయి. ఇందులో రాష్ట్రం 546.64, జిల్లా మేజర్ రహదారులు 791.57 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 167.08 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వీటిలో 884 కిలోమీటర్ల రోడ్లు దారుణంగా తయారయ్యాయి. వీటి మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ.23.52 కోట్లు మంజూరు చేసింది. మిగతా వాటి నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారించాలి.
ఇతర రంగాలిపైనా దృష్టిపెట్టాలి
జిల్లాలో విద్య, వైద్యరంగాలపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ వైద్య కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలి. విద్యాపరంగా మరింత వసతులు మెరుగుపడాలి. విజయనగరం కార్పొరేషన్ విస్తరించినా.. నగరీకరణ జరుగుతున్నా అనుకున్న స్థాయిలో మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. రాజాం మునిసిపాల్టీకి పాలకవర్గం లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. బొబ్బిలి మునిసిపాల్టీది అదే పరిస్థితి. నెల్లిమర్ల నగర పంచాయతీలోనూ సమస్యలు ఉన్నాయి. జిల్లాలో 27 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో మత్స్యకార గ్రామాలున్నాయి. వీటి పరిధిలో జెట్టి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.