Share News

Only for the Land భూమి కోసమే..

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:58 PM

Only for the Land పాచిపెంట మండలంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గిరిజన రైతు కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. భూ వివాదం నేపథ్యంలో హత్యచేసినట్లు తెలిపారు.

Only for the Land భూమి కోసమే..
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాంబాబు

చివరకు హతమార్చిన వైనం

గిరిజన రైతు అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు

నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు

సాలూరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గిరిజన రైతు కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. భూ వివాదం నేపథ్యంలో హత్యచేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాలూరు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో డీఎస్పీ రాంబాబు విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

పాచిపెంట మండలం తంగలాం పంచాయతీ పూలగూడకి చెందిన బోయి అప్పలస్వామి (57) భార్య అప్పలమ్మతో కలిసి అదే ప్రాంతంలో నివస్తున్నాడు. భార్యకు ఆమె కన్నవారు ఇచ్చిన 30 సెంట్లలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు, ముగ్గురు కుమారులకు వివాహాలు చేసేశాడు. అయితే అత్తవారు గ్రామం పనసలపాడులో ఉన్న 30 సెంట్ల పోడుభూమి కోసం అప్పలస్వామి, అదే ప్రాంతానికి చెందిన బోయి రాజుతో నిత్యం వివాదం జరుగుతుండేది. ‘గ్రామంలో లేరు కాబట్టి ఆ భూమి మీది కాదు’ అని రాజు నిత్యం వారితో గొడవ పడేవాడు. అంతే కాకుండా ఇంటిలో ఎవరికి ఆరోగ్యం బాగోలేక పోయినా దానికి కారణం అప్పలస్వామేనని రాజు చెప్పేవాడు. అప్పలస్వామి చేతబడి చేయడం వల్లే అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రచారం చేసేవాడు. ఈక్రమంలోనే రాజు వదిన సోమి అలియాస్‌ సింహాద్రి అనారోగ్యానికి గురైతే అప్పలస్వామి తన సొంత డబ్బులతో ఆమెను విజయనగరం తీసుకెళ్లి వైద్యం చేయించాడు. కాగా గత నెల 25న తంగలాం గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి అప్పలస్వామి, రాజు హాజరయ్యారు. అక్కడ వారి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. గ్రామపెద్ద సారా రాజు వారికి నచ్చజెప్పి పంపించేశాడు. అయితే తంగలాం నుంచి పూలగూడ గ్రామానికి అప్పలస్వామి ఒక్కడే వెళ్లడాన్ని రాజు గమనించాడు. ఆ మార్గం గుండానే వెళ్లాడు. కొండ లోయ రాగానే అప్పలస్వామిపై దాడి చేశాడు. రాయితో తలపై గట్టిగా కొట్టి లోయలోకి తోసేశాడు. అయితే పెళ్లికి భర్త మరుసటి రోజు వరకు ఇంటికి చేరకపోవడంతో అప్పలమ్మ తీవ్ర ఆందోళన చెందింది. పూలగూడ మార్గం గుండా వెళ్లగా అప్పలస్వామి చెప్పులు కనిపించాయి. అక్కడ లోయలో విగతజీవిగా పడి ఉన్న తన భర్తను చూసి భోరున విలపించింది. అప్పలస్వామి తలపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాస్తవాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో గత నెల 29న ఆ పంచాయతీ వీఆర్వో బి.రాధాకృష్ణ శ్రీనివాస్‌ ముందు నిందితుడు రాజు లొంగిపోయాడు. వీఆర్వో సమాచారం మేరకు పోలీసులకు అక్కడకు చేరుకుని రాజును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టణ సీఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్‌ఐ సురేష్‌ ఉన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:58 PM