only case registration కేసు నమోదుతో సరి!
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:42 PM
only case registration కొత్తవలస పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే బాధితులు వెనకడుగు వేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చి స్టేషన్ చుట్టూ తిరిగే కంటే ఊరుకోవడమే మేలని భావిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చిన దొంగతనం కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో ఒక్క కేసులో కూడా రికవరీ లేదని సమాచారం. నిందితులను పట్టుకున్నదీ లేదు. బాధితులు తిరిగి తిరిగి నిరాశకు గురవుతున్నారు.
కేసు నమోదుతో సరి!
రికవరీలు లేని వైనం
పోలీసుల పట్ల నిరాశ చెందుతున్న ఫిర్యాదుదారులు
నిందితులను పట్టుకున్నదీ అరుదే
కొత్తవలసలో వరుసగా చోరీలు
నగలు, డబ్బును పట్టుకుపోతున్న దొంగలు
కొత్తవలస, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):
కొత్తవలస పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే బాధితులు వెనకడుగు వేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చి స్టేషన్ చుట్టూ తిరిగే కంటే ఊరుకోవడమే మేలని భావిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చిన దొంగతనం కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో ఒక్క కేసులో కూడా రికవరీ లేదని సమాచారం. నిందితులను పట్టుకున్నదీ లేదు. బాధితులు తిరిగి తిరిగి నిరాశకు గురవుతున్నారు.
ఈ ఏడాది మే 25వతేదీ తర్వాత భారీ దొంగతనాల నుంచి చిన్న చితకా చోరీ కేసుల వరకు ఒక్క రికవరీ కూడా లేకపోవడమే బాధితుల్లో నిరాశకు కారణం. మే 25న మంగళపాలెం గ్రామంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఇంటిలో జరిగిన దొంగతనంలో పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం 90 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు చోరీ అయింది. అంతకంటే ఎక్కువే బంగారం పోయిందని బాధితులు తెలిపారు. ఈ చోరీ విషయమై సుమారు నెల రోజులు పాటు హడావిడి చేసిన పోలీసులు చివరకు మహారాష్ట్రకు చెందిన పార్దీగ్యాంగ్ పనిగా గుర్తించామని చెప్పి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. ఆ తరువాత పోలీసులకు సవాల్ విసురుతూ స్థానిక ఎలక్ర్టికల్ సబ్‌స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి ఇంటిలో దొంగతనం జరిగింది. ఈ చోరీలో డబ్బు, బంగారం, వెండి వస్తువులు పోయినట్లు ఫిర్యాదు అందినా దొంగలు దొరకలేదు. రికవరీ లేదు. దేశపాత్రునిపాలెం సమీపంలో శారదాస్టీల్ కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగి ఇంటిలో చోరీ జరిగింది. ఈ చోరీలో కూడా బంగారం, డబ్బు పోయింది. ఇప్పటివరకు ఎవరినీ పట్టుకోలేదు. రికవరీ జరగలేదు. ఇక కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని ఆటోమొబైల్ షాపులో రెండు సార్లు దొంగతనం జరిగింది. గిడిజాల రోడ్డులోని పలు చోట్ల నూతనంగా నిర్మాణాలు చేస్తున్న ఇళ్లలోని మోటార్‌లు దొంగతనాలు జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి రికవరీ లేదు. దేశపాత్రునిపాలెం పమీపంలో రోడ్డు పక్కన తెలుగు దేశంపార్టీ విశాఖపార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బొబ్బిలి అప్పారావు నూతనంగా నిర్మాణం చేస్తున్న ఇంటికి సంబంధించి విద్యుత్ పరికరాలు చోరీ అయినట్టు ఫిర్యాదు చేశారు. అవీ దొరకలేదు. ఇటీవల మంగళపాలెం జంక్షన్‌లో నున్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలోని మైక్‌సెట్, యాంప్లిపైర్‌ను స్కూటీపై వచ్చి తీసుకెళ్లడం సీసీ పుటేజ్‌లలో స్పష్టంగా కనిపించింది అయినా చర్యలు లేవు.
- ఇక మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు సంబంధించి సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్‌లు చోరీల్లో రికవరీలు జరగలేదు. దొంగతనాల విషయం అటుంచితే మిగిలిన కేసులలోనూ ఎటువంటి పురోగతి లేదని తెలుస్తోంది. వియ్యంపేటలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలు అనుమానస్పదంగా మృతిచెందిన ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా ఆమె మృతికి గల కారణాలు తెలియ రావడం లేదు. కొన్ని కేసులలో పూర్తి స్థాయిలో దర్యాప్తు లేకుండానే ఆత్మహత్యలుగా చూపిస్తూ కేసులను క్లోజ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశాలపై సీఐను వివరణ కోరినప్పుడల్లా కేసులు దర్యాప్తులో ఉన్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పుకువస్తున్నారు.
- కొత్తవలస పోలీసు స్టేషన్‌లో సిబ్బంది కొరత లేదు. అంత సిబ్బంది ఉన్నా ఎవరు ఏపని చేస్తారో ఎవరికీ తెలీదు. జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య అలానే ఉంటోంది. జిల్లా నుంచి తనిఖీల నిమిత్తం స్టేషన్ వచ్చే అధికారులకు ఇక్కడి సమస్యలను విలేకరులు చెప్పడం, పరిష్కరిస్తామని చెప్పి వెళ్లి పోవడం యథావిధిగా జరుగుతోంది. ఏ ఫిర్యాదు చేసినా న్యాయం జరగనప్పుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసే కంటే ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు.