Road Construction! రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలే!
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:16 AM
Only ₹50 Lakhs for Road Construction! మన్యంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రోడ్డు నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. ఏడాదిగా ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనలు మారడమే ఇందుకు కారణం. కాగా కోట్లాది రుపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఉపాధి’ నిబంధనలను మార్చిన కేంద్ర ప్రభుత్వం
మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జిల్లాలో చేపట్టిన పనులపై ఎఫెక్ట్
ఏడాదిగా బిల్లుల చెల్లింపునకు బ్రేక్
తలలు పట్టుకుంటున్న కాంట్రాక్టర్లు
జిల్లా యంత్రాంగంతో రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష
ఈ పంచాయితీ ఢిల్లీకి చేరనున్నట్లు సమాచారం
పార్వతీపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రోడ్డు నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. ఏడాదిగా ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనలు మారడమే ఇందుకు కారణం. కాగా కోట్లాది రుపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రహదారుల నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా మారు మూల పల్లెలు, కొండ శిఖర గ్రామాలకు పెద్దత్తున రహదారి నిర్మాణాలు చేపట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చేసింది. ఒక రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలే పరిమితం చేసింది. దీంతో మన్యంలో రూ.50లక్షలకు మించి పనులు చేపట్టిన రహదారి బిల్లులకు బ్రేక్ పడింది. నిబంధనల మార్పుతో కాంట్రాక్టర్లు, అధికా రులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ పంచాయితీ ఢిల్లీకి చేరనున్నట్టు సమాచారం.
ఇదీ పరిస్థితి..
- ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా రహదారి నిర్మాణాలు వేగవంతంగా చేపడితే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని ఇంజనీరింగ్ అధికారులు చెబుతూ వచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా ఎంతో ఉత్సాహంగా పనులు చేపట్టారు. అయితే సుమారు ఏడాదిగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిర్మాణాలు ఎలా పూర్తి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో వారు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతున్నారు.
- జిల్లాలో పంచాయతీరాజ్, గిరిజన ఇంజనీరింగ్ శాఖల ద్వారా ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులకు కోట్లాది రూపాయల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ రాజ్‌శాఖ ద్వారా 71 రహదారులకు సుమారు రూ.31 కోట్లు, అదేవిధంగా గిరిజన ఇంజనీరింగ్ శాఖ ద్వారా సమారు రూ.పది కోట్ల పైబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎఫ్‌టీవో జనరేట్ అయినప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా నిబంధనలు మారితే గాని బిల్లులకు క్లియరెన్స్ వచ్చేలా లేదు. అయితే కొత్త నిబంధనల మేరకు రూ.50 లక్షల లోపు చేపట్టిన రోడ్డు నిర్మాణాలకు బిల్లులు మంజూరవుతున్నాయి.
నిబంధనలు ఇలా..
ఉపాధి హామీ పథకంలో నిర్మించే బీటీ రహదారులకు సంబంధించి ఎన్ని కోట్లు అయినా ఒకే రహదారిపై ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ఉదాహరణకు ఒక బీటీ రహదారి నిర్మాణానికి రెండు కోట్లు అవసరమైతే.. ఆ మొత్తం ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్‌లో మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేసేవారు. ఈ మేరకు బిల్లులు చెల్లించే వారు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఇకపై అలా కుదరదు. ఎంత పెద్ద రహదారి అయినా కేవలం రూ. 50 లక్షలు మంజూరు చేయనున్నారు. దీంతో అంతకుమించి నిధులు మంజూరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్య గత కొన్ని నెలలుగా ఇంజనీరింగ్ శాఖ అధికారుల మధ్య నలుగుతోంది. ఈ విషయం బయటకు రానీయకుండా లోలోపల వారు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతండడంతో తాజాగా అసలు విషయం బయటపడింది. మారిన నిబంధనల ప్రకారం ఒక రహదారి నిర్మాణానికి రూ.50 లక్షలు మాత్రమే చెల్లించనున్నారు. అంతకు మించి నిధులతో పనులు చేపడితే బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదు. దీంతో అటు అధికారులు, కాంట్రాక్టర్లకు ఏం చేయాలో తోచడం లేదు. అయితే ఇదే విషయంపై శుక్రవారం అమరావతిలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఆశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనిపై ఢిల్లీకి వెళ్లి సమస్యను వివరించి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుం టామని ఉన్నతాధికారులు చెప్పినట్టు తెలిసింది.
త్వరలోనే బిల్లుల చెల్లింపులు
జిల్లాలో రహదారుల నిర్మాణాలకు సంబంధించి త్వరలోనే బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని బిల్లుల చెల్లింపులు నిలిచిన మాట వాస్తవమే. వాటి పనుల ప్రాప్తికి నిధులు జమవుతాయి.
- నగేష్‌బాబు, జిల్లా ఇంజనీరింగ్ అధికారి, పంచాయతీరాజ్ శాఖ