Support for Women మహిళలకు అండగా వన్‌స్టాప్ సెంటర్
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:28 AM
One-Stop Center as Support for Women వన్‌స్టాప్ సెంటర్ జిల్లా మహిళలకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం పార్వతీపురంలో వన్‌స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
భవన నిర్మాణానికి శంకుస్థాపన
పార్వతీపురం/బెలగాం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): వన్‌స్టాప్ సెంటర్ జిల్లా మహిళలకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం పార్వతీపురంలో వన్‌స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ రూ.60 లక్షల అంచనా వ్యయంతో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వన్‌స్టాప్ సెంటర్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి. అదనపు మౌలిక వసతుల కోసం ప్రతి కేంద్రానికి రూ.లక్ష అందిస్తాం. డోలీ మోతలు లేని జిల్లాగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.13 వందల కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారులు నిర్మించాం. డోలీ మోతలు లేని పరిస్థితి సాధించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.4 వేలు కోట్లు అవసరం. ప్రస్తుతం ప్రతి గ్రామానికీ అంబులెన్స్ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా జిల్లాలో రూ.40 కోట్లతో పనులు ప్రారంభించనున్నాం.’ అని తెలిపారు. అంతకుముందు ‘పోషణ మహా’ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. ఐసీడీఎస్ శాఖ విశేష సేవలందిస్తోందన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. మహిళ విద్యావంతురాలిగా ఉంటే ఆ కుటుంబం మొత్తం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందన్నారు. ఏఎస్పీ అంకితా సురాన మాట్లాడుతూ.. వన్‌స్టాప్ సెంటర్‌పై మహిళలు అవగాహన పెంచుకుని పూర్తిస్థాయిలో వినియో గించుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ చిన్మయదేవి, పీడీ టి.కనకదుర్గ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యులు అప్రమత్తంగా ఉండాలి
పార్వతీపురం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్యులు చాలా అప్రమత్తంగా ఉండాలని. ఎక్కడైనా జ్వరాలు వస్తే అక్కడికక్కడే స్పందించాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వసతిగృహాల్లోని పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లకముందే ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంఽధిత అధికారులతో సమీక్షించారు. ‘ఇకపై వసతిగృహ విద్యార్థులకు వారంలో రెండు రోజుల పాటు పిల్లల వైద్య పరీక్షలు చేయాలి. జిల్లాలో ఉన్న 199 గురుకులాలకు ఏఎన్‌ఎంలను కేటాయించాం. వాటితో పాటు 750 ఆశ్రమ పాఠశాలలకు వారు వెళ్లి విద్యార్థులు పరీక్షించాలి. పీహెచ్‌సీ వైద్యులు కూడా తమ పరిధిలోని ప్రతి వసతిగృహాన్ని సందర్శించాలి. ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు ఉండాలి. సమ్మెలో పలువురు వైద్యులు ఉన్న నేపథ్యంలో సేవలకు ఎటువంటి ఆటంకం కలగకూడదు. వసతిగృహాల్లో పారిశుధ్యం మెరుగకు చర్యలు చేపట్టాలి. మరుగుదొడ్లు, గదులు, తాగునీటి వసతి అన్నీ పక్కాగా ఉండాలి. విద్యార్థులతో క్రీడలు, యోగా వంటివి నిర్వహించాలి. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి. పాడైన రహదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు పూర్తి చేయాలి.’ అని మంత్రి తెలిపారు. కాగా పథకాల అమలులో జాతీయ స్థాయిలో పార్వతీపురం ఐటీడీఏకు గుర్తింపు రావడంపై ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డిని సత్కరించారు. స్థానిక గిరిజనుల సాయంతో జిల్లాలో జలపాతాలను అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆదికర్మయోగి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్టు వివరించారు. పాఠశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టామని, విద్యారులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. విద్యార్థినుల మరణాలు అనంతరం సస్పెన్షన్‌కు గురైన కురపాం గురుకుల ఏఎన్‌ఎంతో పాటు ప్రధానోపాధ్యాయులను, వార్డెన్‌ను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి సంధ్యారాణి సమీక్షా సమావేశంలో ఆదేశించినట్టు సమాచారం. ఇళ్ల దగ్గర బాలికలు మరణిస్తే ఉపాధ్యాయులను బాధ్యులు చేయడం సబబు కాదని, నెల రోజుల్లో వారిని విధుల్లోకి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.