వారంలో.. ఒకరోజే
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:46 PM
జిల్లా కేంద్రం పార్వతీపురాన్ని వర్షాకాలంలో కూడా తాగునీటి సమస్య వేధిస్తోంది.
- వర్షా కాలంలోనూ తాగునీటి సమస్య
- పార్వతీపురం పట్టణ ప్రజలకు తప్పని అవస్థలు
- వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఇన్‌ఫిల్టర్ బావి గొట్టాలు
- ప్రధాన పంప్‌హౌస్‌లో మరమ్మతులకు గురైన మోటారు
పార్వతీపురంటౌన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురాన్ని వర్షాకాలంలో కూడా తాగునీటి సమస్య వేధిస్తోంది. పార్వతీపురం మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు అవుతున్నా.. గ్రేడ్ -1 మున్సిపాలిటీగా రూపాంతరం చెంది 25 ఏళ్లు కావస్తున్నా తాగునీటి సమస్య మాత్రం తీరడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా ఈ సమస్యను పరిష్కరించేవారు కరువయ్యారు. ప్రతి ఏడాది తాగునీటి సరఫరా కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు అధికారులు, పాలకులు చెబుతున్నారు. కానీ, వారం రోజులకొకసారి కూడా కుళాయిల నుంచి నీరు రావడం గగనమైంది. వర్షాకాలం వచ్చిందంటే నాగావళి వరదలతో రంగుమారిన నీటిని సరఫరా చేస్తున్నారని, గత్యంతరం లేక ఆ నీటిని తాగుతున్నామని పట్టణ వాసులు వాపోతున్నారు.
గొప్పలే మిగిలాయి..
గత కొన్నేళ్లుగా జిల్లా కేంద్రాన్ని తాగునీటి సమస్య వేధిస్తోంది. సమస్యను పరిష్కరిస్తామని గత వైసీపీ పాలకులు జిల్లా కేంద్రవాసులకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. రూ.63.63 కోట్ల అంచనా వ్యయంతో సంపూర్ణ తాగునీటి సరఫరా పథకం ఏర్పాటు చేస్తామని అప్పటి పాలకులు గొప్పలు చెప్పారు. ఈ పథకానికి సంబంధించి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద 2019లో అప్పటి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే అలజంగి జోగారావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భూమి పూజ చేశారు. కానీ, పనులు మాత్రం చేపట్టలేదు. గరుగుబిల్లి మండలం సీతారాంపురం వద్ద గ్రావీటీ స్కీమ్ ఏర్పాటు చేసి, తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నాగావళి నది నుంచి నీటిని నేరుగా పార్వతీపురానికి సరఫరా చేస్తామని అప్పటి ఎమ్మెల్యే జోగారావుతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా ప్రకటనలు చేశారు. ఈ మేరకు 2022లో ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం హామీలే తప్పా అమలు చేయడంలో ఒక్క అడుగు ముందుకు.. మూడుగుల వెనక్కి అన్న చందంగా మారడంతో గ్రావీటి స్కీమ్ కాగితాలకే పరిమితమయ్యింది.
దారుణంగా ఇన్‌ఫిల్టర్ బావులు
పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే నాగావళి నదిలోని ఇన్‌ఫిల్టర్ బావుల పరిస్థితి దారుణంగా మారింది. ఎప్పుడో ఆరు దశాబ్దాల కిందట మున్సిపాల్టీ ఏర్పడినప్పుడు నాలుగు ఇన్‌ఫిల్టర్ బావులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1,2,3 ఇన్‌ఫిల్టర్ బావులు వాడుకలో ఉండగా, నాలుగో బావి చుటూ ఇసుక మేటలు వేయడంతో వృథాగా పడిఉంది. మొదటి ఇన్‌ఫిల్టర్ బావిలో నీటిని తోడే 17.5 హెచ్‌పీ మోటారుపైనే జిల్లా కేంద్రానికి తాగునీటి సరఫరా ఆధారపడి ఉంది. ఈ మోటారుపై ఒత్తిడిని తగ్గించడానికి అధికారులు రెండో ఇన్‌ఫిల్టర్ బావిలోని 7.5 హెచ్‌పీ మోటారు వినియోగించే వారు. అయితే, ఈ గొట్టాలు గత నెల నాగావళి నదికి వచ్చిన వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో ఇంజనీరింగ్ అధికారులు 3వ ఇన్‌ఫిల్టర్ బావికి సంబంధించిన 10 హెచ్‌పీ మోటారును వాడుకలోకి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం నాగావళికి వస్తున్న వరదలతో 3వ బావిలోని మోటార్లు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తాగునీటి సరఫరాను మెరుగుపరచాలనే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రెండు 5 హెచ్‌పీ మోటార్లు కూడా వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో పాటు తోటపల్లి ప్రధాన పంప్‌హౌస్ నుంచి బూస్టర్ పంప్ హౌస్‌కు నీటిని సరఫరా చేసే రెండు 75 హెచ్‌పీ మోటర్లలో ఒక మోటారు నెల రోజుల కిందట మరమ్మతులకు గురైంది. ఈ విషయం ఇంజనీరింగ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఒకపక్క నాగావళి నదిలోని ఇన్‌ఫిల్టర్ బావుల వద్ద ఉన్న మోటార్లు, మరోపక్క ప్రధాన పంప్‌హౌస్, బూస్టర్ పంప్‌హౌస్‌లోని మోటార్లకు కాలం చెల్లుతుండడంతో భవిష్యత్‌లో జిల్లా కేంద్ర వాసులకు తాగునీటి కష్టాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.
జనాభాకు తగ్గట్లు సరఫరా కాని నీరు
పార్వతీపురం మున్సిపాలిటీలో జనాభాకు తగ్గట్లు తాగునీరు సరఫరా కావడం లేదు. ఈ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 2012 జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో ఈ మున్సిపాలిటీ జనాభా 55 వేల మంది. గత 13 ఏళ్లలో మున్సిపాలిటీ చుట్టు పక్కల కాలనీలు, రియల్ ఎస్టేట్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పుట్టిగొడుడుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో ప్రస్తుత జనాభా అనాధికార లెక్కల ప్రకారం 80 వేలమందికి పైగా ఉంటారనేది అంచనా. వీరికి కనీసం రోజుకు 40 వేల లీటర్ల నీటిని సరఫరా చేయాలి. రోజును పక్కన పెడితే వారానికి కూడా 40 వేల లీటర్లు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో పార్వతీపురం మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని నాగావళి నది నుంచి పార్వతీపురం పట్టణం వరకు తాగునీటి పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పైపులైన్ ద్వారానే 30 వార్డులకు తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే, ఆరు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్ కావడంతో ఎక్కడికక్కడే లీక్‌లు ఏర్పడి తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు.
ఇబ్బందులు పడుతున్నాం..
ప్రతి ఏడాది తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. వేసవిలో ఎండలతో నాగావళి నది ఎండిపోయి నీరు సరఫరా కావడం లేదు. వర్షాకాలంలో వరదలతో మోటార్లు మరమ్మతులకు గురై తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. వారం రోజులకొకసారి తాగునీటి సరఫరా చేస్తుండడం విచారకరం.
-ఆర్.గోపాలరావు, పార్వతీపురం
హామీలే తప్ప ఆచరణ లేదు..
పాలకులు, అధికారుల అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్ర వాసులు బిందెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని పాలకులు హామీలు ఇవ్వడం తప్ప, ఆచరణలో చూపించడం లేదు. యథా రాజా తథా ప్రజా అన్న చందంగా పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు.
-జీవీ రమణ, ప్రజా సంఘ నాయకుడు, పార్వతీపురం
పక్కాగా సరఫరా చేస్తాం
పార్వతీపురం పట్టణ ప్రజలకు పక్కాగా తాగునీటిని సరఫరా చేసేందుకు మా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. నాగావళికి వరద ఉధృతితో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడడం వాస్తవమే. ఆ సమస్యను అధిగమించేందుకు మా ఇంజనీరింగ్ అధికారులు కష్టపడుతున్నారు. మోటార్లను యుద్ధప్రాతిపదికన బాగు చేసి నీటిని సరఫరా చేస్తాం.
శ్రీనివాసరాజు, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమీషనర్, పార్వతీపురం మున్సిపాల్టీ.