Once You Lose Grip, It’s Over పట్టు తప్పితే అంతే..
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:19 AM
Once You Lose Grip, It’s Over భామినిలో విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. బస్సులకు వేలాడుతూ ఇలా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
భామిని, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): భామినిలో విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. బస్సులకు వేలాడుతూ ఇలా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇటు బత్తిలి, అటు చిన్నదిమిలి నుంచి సుమారు 700 మంది రోజూ మండల కేంద్రానికి వస్తుంటారు. ఏపీ ఆదర్శ పాఠశాలలో 400, జూనియర్ కళాశాలలో 200 మంది, హైస్కూల్‌లో వందమందితో పాటు ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు చేస్తుంటారు. అయితే పూర్తిస్థాయిలో బస్సులు లేకపోవడంతో వారికి ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా విద్యార్థులు నిత్యం ప్రమాదకర స్థితిలో ప్రయాణించాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు రావాల్సిన బస్సు అరగంట ఆలస్యంగా వచ్చింది. దీంతో భామిని బస్టాప్‌లో జూనియర్ కళాశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఒకేసారి పోటెత్తారు. బస్సులో ఫుట్‌పాత్‌పై నిలబడి కొందరు.. మరికొందరు వేలాడుతూ.. ప్రయాణించారు. అయితే పట్టుతప్పితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని భావించి కొందరు వేరే బస్సు కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.