Once again ACB rides మరోసారి ఏసీబీ రైడ్స్
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:10 AM
Once again ACB rides జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఈసారి విజయనగరంలో ఉంటున్న భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పి.రామకృష్ణ ఇంటితో పాటు మరో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగుల ఇళ్లు, ఈ కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రైవేటు వ్యక్తి ఆలేటి కనకారావు ఇంట్లోనూ ఏసీబీ సోదా చేసింది.
మరోసారి ఏసీబీ రైడ్స్
విజయనగరంలోని భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ ఉద్యోగుల ఇళ్లలో సోదా
ఓ ప్రైవేటు వ్యక్తి ఇంట్లోనూ తనిఖీలు
నగదు, బంగారం, డాక్యుమెంట్లు స్వాధీనం
సకాలంలో తెరుచుకోని భోగాపురం కార్యాలయం
11 గంటల తరువాత వచ్చిన సిబ్బంది
దస్తావేజు తయారీ సెంటర్లు మూత
జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఈసారి విజయనగరంలో ఉంటున్న భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పి.రామకృష్ణ ఇంటితో పాటు మరో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగుల ఇళ్లు, ఈ కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రైవేటు వ్యక్తి ఆలేటి కనకారావు ఇంట్లోనూ ఏసీబీ సోదా చేసింది. ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారు. ఈ పరిణామంతో భోగాపురం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం సకాలంలో తెరుచుకోలేదు. ఉదయం 11 గంటల తర్వాత కొందరు ఉద్యోగులు వచ్చి తెరిచారు. దస్తావేజు తయారీ సెంటర్లు అన్నీ మూత పడి కనిపించాయి.
విజయనగరం క్రైం/ భోగాపురం, డిసెంబరు23(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో ఉంటున్న భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ మంగళవారం రైడ్ చేసింది. ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్‌ఐ, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణ ఉంటున్న ఎస్‌వీఎన్ నగర్‌లోని ఆయన నివాసంలో చేపట్టిన సోదాలో కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసంలో నగదు రూ.30,400 స్వాధీనం చేసుకున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు వ్యక్తి భోగాపురంలోని ఆలేటి కనకరాజు నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. ఆయన నివాసం నుంచి రూ.18 లక్షల10 వేల నగదుతో పాటు 550 గ్రాముల బంగారం, 937 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఉడాకాలనీలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కృష్ణ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. రూ.లక్షా 25 వేల 400 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కుమ్మరవీధిలో ఉంటున్న మరో జూనియర్ అసిస్టెంట్ అశోక్, ప్రదీప్‌నగర్‌లో ఉంటున్న సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మీ నివాసంలోనూ తనిఖీలు చేశారు. వీరి ఇళ్లలో రూ.40 వేల నగదు గుర్తించారు. ప్రదీప్‌నగర్‌లో ఉంటున్న మెర్సీ నివాసంలో కూడా తనిఖీలు చేపట్టారు. కొంత మొత్తంలో నగదును గుర్తించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని సబ్‌రిజిస్టార్ రామకృష్ణ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో ఇన్‌స్పెక్టరు మహేష్, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ గత నెల 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు ఏసీబీ భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలకమైన దస్త్రాలు, సెల్‌ఫోన్లు, రూ.35వేలు నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతాయని ఆ నెల 6వ తేదీన ఏసీబీ డీఎస్పీ రమ్య స్పష్టంచేశారు. అన్నట్టుగానే సోమవారం మరోసారి ఏసీబీ దాడులు చేసింది. ఈసారి కార్యాలయంలో కాకుండా కార్యాలయంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లను సోదా చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రైవేటు వ్యక్తి ఆలేటి కనకారావు ఇంటినీ తనిఖీ చేశారు. భోగాపురం తోటవీధిలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిన ఏసీబీ సిబ్బంది రూ.18 లక్షల10 వేల నగదుతో పాటు 550 గ్రాముల బంగారం, 937 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఫ ఎప్పటిలాగే భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనిచేస్తుందని భావించి చాలా మంది సుమారు 9గంటల నుంచి నిరీక్షించారు. ఉదయం 11 గంటల సమయంలో వారంతా వెనుతిరిగి వెళ్లిపోయారు. 11.15 నిమిషాల తరువాత సీనియర్ అసిస్టెంట్ పి.ప్రవీణ్, మరో ఇద్దరు సహ ఉద్యోగులు వచ్చి తలుపులు తెరిచారు. దీనిపై సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌ను వివరణ కోరగా జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర ఆదేశాల మేరకు ఇక్కడకి వచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తెరిచామన్నారు. కార్యాలయానికి వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కాగా ప్రైవేటు వ్యక్తి ఆలేటి కనకారావు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరగడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో ఉన్న అన్ని దస్తావేజు తయారీ కేంద్రాల తలుపులు తెరవలేదు.
లోతుగా విచారిస్తున్నాం
రమ్య, డీఎస్పీ, విజయనగరం
ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయనగరంలో ఉంటున్న భోగాపురం సబ్ రిజిస్ట్రార్‌తో పాటు కార్యాలయ సిబ్బంది నివాసాల్లో రైడ్ చేశాం. ఈ కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రైవేటు వ్యక్తి ఉంటున్న భోగాపురంలోనూ తనిఖీలు చేపట్టాం. మంగళవారం కొంత మొత్తం నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం స్పష్టత వస్తుంది.