Share News

ప్రగతి బాటలో..

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:44 PM

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస అభివృద్ధికి నోచని గిరిజన గ్రామాలు నేడు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో ప్రగతి బాటలో పయని స్తున్నాయి.

   ప్రగతి బాటలో..
నాడు పడాలవలస-సిమిడివలస రహదారి పరిస్థితి

- గిరిజన గ్రామాలకు పక్కా రహదారులు

- ప్రభుత్వ చొరవతో శరవేగంగా నిర్మాణాలు

- ఏజెన్సీకి కొత్త కళ.. గిరిపుత్రుల హర్షం

పార్వతీపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస అభివృద్ధికి నోచని గిరిజన గ్రామాలు నేడు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో ప్రగతి బాటలో పయని స్తున్నాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో శరవేగంగా రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. గిరిశిఖర గ్రామాల్లో కూడా బీటీ రహదారుల పనులు ఊపందుకున్నాయి. ఒకప్పుడు రాళ్లు.. రప్పలు.. గోతులతో దర్శనమిచ్చిన దారుల రూపురేఖలన్నీ మారుతున్నాయి. దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యానికి నోచుకోని గిరిజన గ్రామాలు బీటీ రహదారులతో కళకళలాడుతున్నాయి. సుమారు రూ.145 కోట్లతో జిల్లాలో వంద రహదారుల నిర్మాణాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఇప్పటిఏ 35 రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. 65 రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటి నిర్మాణాలు పూర్తయితే వందలాది గిరిజన గ్రామాల ప్రజల దారి కష్టాలు తప్పుతాయి.

ఇదీ పరిస్థితి..

ఏ ప్రాంత అభివృద్ధికైనా రహదారులు కీలకం. అయితే గత వైసీపీ సర్కారు ఈ విషయాన్ని విస్మరించింది. రహదారుల నిర్మాణాల విషయంలో అలసత్వం ప్రదర్శించింది. కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది. కనీసం మరమ్మతులకు పైసలు కూడా విదల్చలేదు. దీంతో గత ఐదేళ్లుగా జిల్లాలో మైదాన, గిరిజన ప్రాంతవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర వేళల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు నానా కష్టాలు పడేవారు. గిరి శిఖర గ్రామస్థులకైతే డోలీ మోతలు తప్పేవి కావు. కొండలు దిగి.. కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు దాటుకుని ఆసుపత్రులకు చేరుకునే లోపు ఎంతోమంది రోగులు మృతి చెందేవారు. అయితే వారి కష్టాలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నిధులు మంజూరు చేస్తుండడంతో రహదారుల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి.

రహదారుల నిర్మాణాలు ఇలా..

  • పాచిపెంట మండలం పూడి నుంచి మెలియాకంచు వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర బీటీ రహదారిని నిర్మించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోటీ 50 లక్షలతో పనులు ప్రారంభించి పనులు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.నాలుగు కోట్ల 50 లక్షలతో ఈ రోడ్డు పనులను పూర్తి చేయించింది. దీంతో సుమారు 20 గిరిజన గ్రామాల్లో 8,800 ప్రజల రహదారి కష్టాలు తీరాయి. వారికి డోలీ ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. ఇదిలా ఉండగా అదే మండలంలో కొండ శిఖర గ్రామం కొండమోసూరు- కోదువలసకు రూ.కోటీ 25 లక్షలతో బీటీ రహదారిని నిర్మించారు.

  • సాలూరు మండలం పడాలవలస నుంచి చిమిడివలస వయా కొత్తూరు గ్రామానికి చెందిన రహదారి గతంలో దారుణంగా ఉండేది. వర్షం పండిందంటే ఆ గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగించలేకపోయేవారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన మాత్రమే చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటీ 25 లక్షలతో బీటీ రహదారిని నిర్మించింది.

  • కొమరాడ మండలం దిగువ గుణద, ఇన్నీడి, సవర గుండా పలు గ్రామాలకు సుమార రూ.3కోట్ల పది లక్షలతో పక్కా రహదారిని నిర్మించారు. దీంతో ఆ ప్రాంతవాసులు దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం లభించింది.

  • కురపాం మండలం జి.శివడ, రాముడుగూడ, కీడివాయి గ్రామాలకు రూ.రెండు కోట్ల 90 లక్షలతో పక్కా రహదారిని నిర్మించారు. దీంతో ఆయా గ్రామస్థులు డోలీ మోతలు తప్పాయి.

  • జియ్యమ్మవలస మండలం సీటీ మండగోడ నుంచి సిటీ మండకు రూ.కోటీ 32 లక్షలతో పక్కా రహదారి నిర్మించారు.

పక్కా రహదారుల నిర్మాణమే లక్ష్యం

డోలీలు మోతలు లేకుండా ప్రతి గిరిజన గ్రామానికీ పక్కా రహదారి నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు వంద రహదారులు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో 35 పనులు పూర్తయ్యాయి.

- గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

ప్రభుత్వ ఆదేశాలతో ..

ప్రభుత్వ ఆదేశాలతో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో వంద రహదారుల నిర్మాణాలు ప్రారంభించాం. ఇప్పటికే 35 రహదారులు పూర్తికాగా మిగిలిన రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

- మణిరాజు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, గిరిజన ఇంజనీరింగ్‌ శాఖ, పార్వతీపురం ఐటీడీఏ

22-patanikparavathipuram-2.gif

నేడు పడాలవలస-సిమిడివలస రహదారి పరిస్థితి

Updated Date - Jul 24 , 2025 | 11:44 PM