old students came korukonda suchoolఆ గురుతులు అపూర్వం
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:03 AM
old students came korukonda suchool చదువు పూర్తయ్యాక ఉన్నత ఉద్యోగాలు చేసి.. కీలక బాధ్యతలు చూసి.. రిటైర్డ్ అయిన వారంతా ఒక్కసారి చిన్నపిల్లలైపోయారు. చదువుకున్న నాటి సంగతులను నెమరువేసుకుంటూ స్కూల్ పరిసరాల చుట్టూ కలియతిరిగారు. తాము కూర్చుని మాట్లాడుకున్న స్థలాలను, చెట్టు కింద ఆడిన ఆటలను నెమరువేసుకుని పులకించిపోయారు. స్నేహితులకు పెట్టిన నిక్‌నేమ్‌లను గుర్తు చేసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఆ గురుతులు అపూర్వం
స్కూల్ అంతా కలియ తిరిగి.. తరగతి గదిలో కూర్చుని
ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపిన కోరుకొండ సైనిక స్కూల్ పూర్వ విద్యార్థులు
నాటి ఉపాధ్యాయులకు సన్మానం
చదువు పూర్తయ్యాక ఉన్నత ఉద్యోగాలు చేసి.. కీలక బాధ్యతలు చూసి.. రిటైర్డ్ అయిన వారంతా ఒక్కసారి చిన్నపిల్లలైపోయారు. చదువుకున్న నాటి సంగతులను నెమరువేసుకుంటూ స్కూల్ పరిసరాల చుట్టూ కలియతిరిగారు. తాము కూర్చుని మాట్లాడుకున్న స్థలాలను, చెట్టు కింద ఆడిన ఆటలను నెమరువేసుకుని పులకించిపోయారు. స్నేహితులకు పెట్టిన నిక్‌నేమ్‌లను గుర్తు చేసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యారు. తరగతి గదిలో కాసేపు గడిపి బాల స్నేహితులుగా మారారు. ఒకరికొకరు యోగక్షేమాలను తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. యాభై ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరంతా కోరుకొండ సైనిక స్కూల్ పూర్వ విద్యార్థులు. స్కూల్‌కు శనివారం హాజరై అ‘పూర్వ’ గురుతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు.
విజయనగరం రూరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
కోరుకొండ సైనిక స్కూల్‌లో యాభై ఏళ్ల కిందట చదువుకున్న వారిలో దాదాపు 50మంది (1968 నుంచి 1975బ్యాచ్) పూర్వ విద్యార్థులు శనివారం కలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు స్కూల్‌లోని పీవీజీ రాజు సమావేశ భవనంలో సమావేశమయ్యారు. ఆ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కెప్టెన్ సీఎం రెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత అత్యున్నత అధికారులుగా బాధ్యతలు నిర్వహించిన వారిని ఆయన పరిచయం చేశారు. విజయబ్యాంకు డైరెక్టర్ బీఎస్ రామారావు, ఎ.సుధీర్, సోమేశ్వర్‌తో పాటు పలువురు మాట్లాడారు. అప్పట్లో ఉపాఽధ్యాయులుగా పనిచేసిన మార్తాండ, అప్పలస్వామి, పీకే బోస్‌లను సన్మానించారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ శర్మ. వైస్ ప్రిన్సిపాల్ వింగ్ కమాండర్ కిరణ్, పూర్వ విద్యార్థి సంఘాల కో-ఆర్డినేటర్ కె.శశికిరణ్‌లను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థి బీఎస్ రామారావు మాట్లాడుతూ, మరో జన్మ అంటూ ఉంటే కోరుకొండ సైనికస్కూల్‌లో చదువుకోవాలని దేవుడ్ని కోరుకుంటున్నానన్నారు. అంకితభావంగల ఉపాధ్యాయులు, చిత్తశుద్ధి కలిగిన విద్యార్థుల వల్లే నేటికీ కోరుకొండ సైనిక స్కూల్ విశేష ప్రాచుర్యం పొందుతోందని చెప్పారు. పూర్వ విద్యార్థులంతా కలిసి ప్రస్తుత విద్యార్థుల కోసం 160 బీరువాలను అందించారు.
ఎంతో ఆనందంగా ఉంది
పీకే బోస్, పూర్వపు కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు, కోరుకొండ సైనిక స్కూల్
ఎంతో ఆనందంగా ఉంది. ఆ నాటి విద్యార్థులతో కలిసి స్కూల్‌ను సందర్శించడం, అందరం కలిసి మాట్లాడుకోవడం మరిచిపోలేనిది. అత్యున్నత స్థానాలను అధిరోహించిన విద్యార్థులను చూసి ఎంతో ఆనందం కలిగింది. కోరుకొండ సైనిక స్కూల్ విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ ఈనాటికీ కొనసాగుతున్నది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలి.
తీర్చిదిద్దిన ఘనత కోరుకొండ స్కూల్‌దే
సీఎం రెడ్డి, కెప్టెన్, పూర్వ విద్యార్థి
విద్యను అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డాం. మంచి హోదాల్లో దేశానికి సేవలు అందించాం. ఆ ఘనత కోరుకొండ సైనిక స్కూల్‌కే దక్కుతుంది. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ రోజు ఇక్కడకు వచ్చాం. ఇబ్బందులన్నీ మరిచిపోయి ఆనందంగా గడిపాం. ఈ క్షణాలు మరువలేనివి. పూర్వ విద్యార్థులమంతా కలిసి 160 బీరువాలను అందించాం.
మరోసారి రావాలని కోరుకుంటున్నాం
బీఎస్ రామారావు, డైరెక్టర్, విజయాబ్యాంకు
అంతా ఒక చోట కలిశాం. చిన్న నాటి స్నేహితులను కలుసుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఇలాంటి అవకాశం మరోసారి రావాలని కోరుకుంటున్నాం. విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ కోరుకొండ సైనిక స్కూల్ సొంతం. నేను క్రీడలపై ఆసక్తి చూపి ఎన్నో పతకాలు సాధించాను. చదువుకున్న స్కూల్‌కు కాసంత సాయం చేశాం. పూర్వ విద్యార్థులమంతా కలిసి 160 బీరువాలను అందించాం.