Share News

Okay with the trial run! ట్రయల్‌ రన్‌తో సరి!

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:03 AM

Okay with the trial run! బొబ్బిలి, సాలూరు ప్రాంతాల నుంచి విశాఖ, విజయనగరం ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు ప్యాసింజరు రైలుపై పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విశాఖపట్నానికి ప్రవేశపెట్టనున్న ప్యాసింజరు రైలుకు గత ఏడాది ఇదే నెలలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

 Okay with the trial run! ట్రయల్‌ రన్‌తో సరి!
గత ఏడాది ప్రారంభోత్సవ సమయంలో బొబ్బిలి చేరుకున్న సాలూరు-విశాఖ రైలు

ట్రయల్‌ రన్‌తో సరి!

రైలు బస్సు స్థానంలో రైలేదీ?

సాలూరు-విశాఖ వయా బొబ్బిలి ప్యాసింజరు రైలు ఎప్పటికో

నిరాశలో ప్రయాణికులు

బొబ్బిలి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి)

బొబ్బిలి, సాలూరు ప్రాంతాల నుంచి విశాఖ, విజయనగరం ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు ప్యాసింజరు రైలుపై పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విశాఖపట్నానికి ప్రవేశపెట్టనున్న ప్యాసింజరు రైలుకు గత ఏడాది ఇదే నెలలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి బొబ్బిలికి మధ్యాహ్నం 12.30కి, సాలూరుకు 1.10 గంటలకు చేరుకుంటుందని, తిరిగి సాలూరు నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు విశాఖ చేరుకుంటుందని అప్పట్లో అధికారులు ప్రకటించారు. నేటికీ ఆచరణ మాత్రం లేదు. రైలు బస్సు స్థానంలో పూర్తిస్థాయి రైలు ఎప్పుడనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.

బొబ్బిలి, సాలూరు ప్రాంతాల నుంచి విశాఖ, విజయనగరం ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికుల అవసరాలను ప్రస్తుత రైళ్లు తీర్చలేకపోతున్నాయని, ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రయాణీకులకు సాధారణ బోగీలు సరిపడా లేక నానా అవస్థలు పడుతుండడంతో అదనపు బోగీలతో కూడిన ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేయాలని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు అనేక సంవత్సరాలుగా కోరుతున్నాయి. కాగా బొబ్బిలి-సాలూరు మధ్య నడిచే రైలు బస్సును కరోనా కాలం నుంచి పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఈ రెండు పట్టణాల మధ్యనున్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు మార్గం పూర్తిగా పాడైపోయిన నేపథ్యంలో రైల్వే ప్రయాణం సురక్షితం, ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ప్రజలకు పూర్తిస్థాయిలో రైల్వే సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవల దుర్గ్‌ నుంచి విశాఖకు వందేభారత్‌ రైలును ఏర్పాటు చేశారు. ఆ రైలుకు బొబ్బిలిలో హాల్ట్‌ లేకపోయింది. కాగా కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్‌భారత్‌ రైలుకు బొబ్బిలిలో హాల్ట్‌ ఇచ్చారు. ఇది కాసంత ఊరటే. బొబ్బిలి నుంచి విశాఖ లేదా విజయనగరానికి షటిల్‌ రైలు సర్వీసులు ప్రవేశ పెట్టాలని, బొబ్బిలి-నుంచి సాలూరుకు గతంలో మాదిరిగా రైలు బస్సు నడపాలని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా కోరుతున్నారు.

రైలు ప్రయాణికుల కష్టాలు తీరేదెప్పుడు

పి.శంకరరావు, బొబ్బిలి

బొబ్బిలి ప్రాంతం నుంచి రైళ్లలో ప్రయాణించే వారి కష్టాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా జనరల్‌ బోగీలను రైళ్లలో పెంచడం లేదు. బొబ్బిలి-సాలూరు మధ్య ఆగిపోయిన రైలు సర్వీసును ఎందుకు పునరుద్ధరించడం లేదో అర్థం కావడం లేదు. బొబ్బిలి , సాలూరును కలుపుతూ విశాఖ వరకు గతంలో ప్రకటించిన మాదిరిగా షటిల్‌ రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలి.

మా లాంటి వారికి ఎంతో ఉపయోగం

రమేష్‌, చిరువ్యాపారి, బొబ్బిలి

బొబ్బిలి-సాలూరు పట్టణాల మధ్య రైలు నడిస్తే మాలాంటి చిరు వ్యాపారులకే కాకుండా రైతులకు, కూలీలకు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్యను అధిగమించి తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించడానికి వీలుంటుంది. ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

Updated Date - Oct 13 , 2025 | 12:03 AM