Useless! అబ్బే.. అవి పనికిరావు!
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:13 AM
Oh No.. Those Are Useless! నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్క్ ఏర్పాటు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో జిల్లా నిరుద్యోగ యువత ఎంతో సంబరపడ్డారు. పరిశ్రమలు ఏర్పాటైతే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని, పొరుగు రాష్ర్టాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదని భావించారు. అయితే జిల్లాలో పరిశ్రమల శాఖాధికారుల తీరు మాత్రం మరోలా ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని కాగితాలకే పరిమితం చేసేవిధంగా ప్రయత్నిస్తోంది.
స్థల సేకరణ, కొనుగోలుకు ముందుకురాని వైనం
రెవెన్యూ శాఖ చూపే భూములు పనికిరావంటూ నివేదికలు
పరిశ్రమల శాఖ తీరుపై విమర్శలు
ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా?
పార్వతీపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్క్ ఏర్పాటు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో జిల్లా నిరుద్యోగ యువత ఎంతో సంబరపడ్డారు. పరిశ్రమలు ఏర్పాటైతే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని, పొరుగు రాష్ర్టాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదని భావించారు. అయితే జిల్లాలో పరిశ్రమల శాఖాధికారుల తీరు మాత్రం మరోలా ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని కాగితాలకే పరిమితం చేసేవిధంగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో పాలకొండ మినహా మిగతా నియో జకవర్గాల్లో ఇప్పటివరకు ఎంఎస్‌ఎంఈ పార్క్‌లకు స్థలాలను ఖరారు చేయలేదు. భూముల కొనుగోలుకు, నష్టపరిహారం చెల్లింపులకు ముందుకు రాకపోగా, ఈ విషయంలో పరిశ్రమల శాఖ కుంటిసాకులు చెబుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు రెవెన్యూ శాఖ తనవంతు ప్రయత్నం చేస్తోంది. కానీ పర్రిశమల శాఖ మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం పనుకువలస మాత్రమే ఎంఎస్‌ఎంఈ పార్క్ సంబంధించి స్థలాన్ని ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో స్థల సేకరణ చేయలేకపోయారు.
- సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం కొటికపెంట రెవెన్యూ పరిధి సరాయివలస సమీపంలో సర్వే నెంబరు 210లో 40 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు రెవెన్యూశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ భూమి అటవీశాఖకు చెందిందని పరిశ్రమల శాఖ చెబుతోంది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అది కొండ పోరంబోకుగా నమోదై ఉంది. మొత్తంగా ఆ ప్రాంతంలో పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు.
- కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం చిలకాం వద్ద దత్తివలసలో గ్రామంలో డీపట్టా భూమిని రెవెన్యూ శాఖాధికారులు చూపించారు. అక్కడ ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ భూములు కొనుగోలు చేయలేమని పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు.
- పార్వతీపురం నియోజకవర్గం చందలింగి గ్రామం వద్ద డీపట్టా భూములను రెవెన్యూ శాఖాధికారులు ఎంపిక చేశారు. అయితే నష్టపరిహారం చెల్లించేందుకు పరిశ్రమల శాఖ ముందుకు రావడం లేదు. ఇలా ఆ శాఖాధికారులు ఏదో ఒక కారణం చెబుతూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చొరవ చూపకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
25 ఎకరాలు ఎక్కడ?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖాళీగా ఉన్న భూములను జగనన్న కాలనీలకు కేటాయించారు. దీంతో నియోజకవర్గాల్లో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడా కానరావడం లేదు. దీంతో భూ సేకరణ ఎప్పుడు జరుగుతుంది.. ఎంఎస్‌ఎంఈ పార్కలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూమి లేనప్పుడు పరిశ్రమల శాఖాధికారులు భూములు కొనుగోలుకు ముందుకు వచ్చి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మన్యంవాసులు కోరుతున్నారు.
భూములను చూపించాం
‘ రెవెన్యూశాఖ ద్వారా ఎంఎస్‌ఎంఈ పార్క్‌లకు సంబంధించి తగు చర్యలు తీసుకుంటున్నాం. పాచిపెంట మండలంలో కొటికపెంట వద్ద భూమిని చూపించాం. ఆ ప్రాంతం అనుకూలంగా ఉండదని పరిశ్రమల శాఖాధికారులు చెబుతున్నారు. అదేవిధంగా చిలకాం, చందలంగి వద్ద అసైండ్ భూములు చూపించాం. వాటిని పరిశ్రమల శాఖ కొనుగోలు చేయాల్సి ఉంది. అసైన్డ్ భూములకు సంబంధించి పరిశ్రమలశాఖ డీ పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది.’ అని జిల్లా రెవెన్యూ అధికారి హేమలత తెలిపారు.