Oh No… The Ghat! అమ్మో.. ఘాట్!
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:08 PM
Oh No… The Ghat! జిల్లాలో ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. మలుపుల వద్ద కనీస చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా విద్యుత్, సోలార్ దీపాలు, రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఘాట్ రోడ్లపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
మలుపుల వద్ద కానరాని రక్షణ చర్యలు
హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయని వైనం
బిక్కుబిక్కుమంటూ రాకపోకలు
తరచూ ప్రమాదాలకు గురువుతున్న చోదకులు, ప్రయాణికులు
అల్లూరి జిల్లా ఘటనతో అధికారులు మేలుకుంటారా?
సీతంపేట రూరల్/ పాచిపెంట/ గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. మలుపుల వద్ద కనీస చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా విద్యుత్, సోలార్ దీపాలు, రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఘాట్ రోడ్లపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఎంతో మంది మృత్యువాత పడుతుండగా, మరెంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. మొత్తంగా ప్రయా ణికులు, వాహనదారులకు రక్షణ కొరవడింది. ఘాట్‌రోడ్లపై బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో మన్యం అధికారులు అప్రమత్తం కావల్సి ఉంది.
ఇదీ పరిస్థితి..
సాలూరుకు అతి సమీపంలోని పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్ట్ నుంచి ఒడిశా రాష్ట్రం సుంకి (ఆంధ్ర-ఒడిశా బోర్డర్ )వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. భారీగా సరుకు రవాణా జరుగు తుంది. విశాఖ నుంచి సాలూరు మీదుగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వరకూ ఏపీతో పాటు ఆయా రాష్ర్టాలకు చెందిన బస్సులు, లారీలు రాకపోకలు సాగి స్తుంటాయి. కాగా ఈ బోర్డర్ వరకూ చేరుకోవాలంటే వాహన డ్రైవర్లకు కత్తిమీద సామే. ఘాట్ రోడ్డు ఎక్కి దిగినంత వరకూ వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణి స్తుంటారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు లేవు. మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఒక్కోసారి వాహనాలు అదుపు తప్పి లోయలోకి బోల్తా పడుతున్నాయి. గతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో తరచూ ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో సుంకి వద్ద రాత్రి 10గంటలు దాటితే లారీలను నిలిపేసేవారు. అయితే ఇప్పుడు అటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
సీతంపేటలో..
సీతంపేట ఏజెన్సీలో కొన్ని గిరిశిఖర గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగిలిన ప్రాంతాలకు ఆటోలు, బైక్‌లపై వెళ్లాల్సిందే. సీతంపేట నుంచి దోనుబాయి, పొల్ల, గడిగుజ్జి వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే సుమారు 25 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డుపై బస్సులో ప్రయాణిం చాల్సిందే. అయితే ఈ రహదారి గుండా ఎన్నో మలుపులు. వాహనదారులు అప్రమత్తంగా లేకుండా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. దోనుబాయి, పొల్ల ప్రాంతాలకు వెళ్లే మార్గంలో మలుపుల వద్ద ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగు తున్నాయి. ఆడలి, జగతిపల్లి, సున్నపుగెడ్డ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు సైతం మార్గమధ్యంలోని ఘాట్‌రోడ్డులో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారు. కొండ దారుల్లోని మలుపుల వద్ద రక్షణ గోడలు నిర్మించాల్సి ఉన్నా.. ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ‘సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలోని ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సులు, ఆటో, ద్విచక్ర వాహన చోదకులకు రహదారి ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఘాట్ రోడ్లలో ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ చర్యలు చేపడితే కొంత వరకు ప్రమాదాలను తగ్గించొచ్చు.’ అని ఎస్‌ఐ అమ్మనరావు చెప్పారు.
గుమ్మలక్ష్మీపురంలో ..
గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఉన్న పలు ఘాట్ రోడ్లలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎల్విన్‌పేట మీదుగా గుణుపూర్, ఇరిడి నుంచి తాడికొండ , గుమ్మలక్ష్మీపురం నుంచి లుంబేషు వెళ్లే మార్గంలో ఒప్పంగి గ్రామ సమీపంలో ఘాట్ రోడ్లలో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారు. రక్షణ గోడలు లేకపోవడమే ఇందుకు కారణం. సందుబడితో పాటు కురుపాం మండలం పి.లేవిడి నుంచి ఉన్న ఘాట్ రోడ్డుపై కూడా వాహనదారులు ప్రమాదకర స్థితిలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది.