King Cobra! అమ్మో.. కింగ్ కోబ్రా!
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:58 PM
Oh No.. King Cobra! జిల్లావాసులను కింగ్ కోబ్రాలు వణికిస్తున్నాయి. తరచూ జనావాసాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ సర్పాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గిరిజనులైతే కొండల్లో పోడు, వ్యవసాయ భూములకు కూడా వెళ్లలేకపోతున్నారు.
నెల వ్యవధిలో నాలుగు చోట్ల కనిపించిన విష సర్పాలు
హడలిపోతున్న మన్యం వాసులు
ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన
జియ్యమ్మవలస, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లావాసులను కింగ్ కోబ్రాలు వణికిస్తున్నాయి. తరచూ జనావాసాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ సర్పాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గిరిజనులైతే కొండల్లో పోడు, వ్యవసాయ భూములకు కూడా వెళ్లలేకపోతున్నారు. మన్యంలో ఎక్కడికక్కడ కింగ్ కోబ్రాలు కనిపిస్తుండడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకముందే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
నెల రోజుల వ్యవధిలోనే కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండలాల్లో నాలుగు సార్లు కింగ్ కోబ్రాలు కనిపించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. తొలుత ఏప్రిల్ 18న కురుపాం - రావాడ ప్రధాన రహదారికి పక్కనే రెండు కింగ్ కోబ్రాలు సయ్యాటలాడుతూ కనిపించాయి. ఆగస్టు 12న కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఆగురు శివ ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌లో ఈ విష సర్పం కనిపించింది. దాదాపు 15 అడుగుల పొడవు ఉన్న ఈ గిరి నాగు (కింగ్ కోబ్రా)ను చూసి ప్రజలు హడలెత్తిపోయారు. అదే నెల 16న గుమ్మలక్ష్మీపురం మండలం కొండవీధిలో 14 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. ఈనెల 8న సీతంపేటలోని ఒక ప్రైవేట్ నర్సరీ ఫారంలో 16 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది. వాటిని స్నేక్ క్యాచ్చర్స్ పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే అవి ఎప్పుడు మళ్లీ తిరిగొస్తాయోనని ఏజెన్సీ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కాగా ఈ నెల 12న కురుపాం మండలం తెన్నుఖర్జ గ్రామంలో ఒక ఇంట్లోకి 13 అడుగుల కింగ్ కోబ్రా చేరడంతో ఆ గ్రామస్థులు భయబ్రాంతులకు గురయ్యారు.
అత్యంత విష పూరిత సర్పం
కింగ్ కోబ్రా అత్యంత విష పూరిత సర్పం. కొండ చిలువ, ఇతర సర్పాలు, ఉడుములు (బల్లి జాతికి చెందినవి), పక్షులు, చిన్న చిన్న జంతువులను కాటేసి తింటాయి. ఇవి అత్యంత వేగంగా (అంటే గంటకు 19 కిలో మీటర్లు) కదులుతాయి. ఎక్కువ నదులు, సరస్సులు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆకలైతే తన పిల్లలను సైతం తినేస్తాయి. దీని ఒక్క కాటుతో ఏనుగును సైతం చంపగలదు. దీని ఒక్క విషపు బొట్టుతో ఒకేసారి 20 మంది చనిపోయే అవకాశం ఉంది. ఇది సాధారణంగా 18.5 అడుగులు (5.7 మీటర్లు) పొడవు , 9 కిలోల వరకు బరువు ఉంటుంది. ఆడ కింగ్ కోబ్రా ఒకేసారి 20 - 40 గుడ్లును పెడుతుంది. దీని జీవిత కాలం 20 ఏళ్లు. ఇవి పశ్చిమ కనుమలు, తూర్పు ఈశాన్య రాష్ట్రాల అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
జాగ్రత్తలు ఇలా
కింగ్ కోబ్రా కనిపించేటప్పుడు దాని దగ్గరకు వెళ్లకూడదు. దూరంగా ఉంటూ దాని ప్రతి కదలికను గమనించాలి. అనవసరంగా కవ్వించకూడదు. యూట్యూబ్‌లో, ఇతర మాధ్యమాల్లో చూసి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. కింగ్ కోబ్రాలు ఆరు అడుగుల వరకు నిలబడగలవు. దానికి ముప్పు అనిపిస్తే కచ్చితంగా కాటేస్తుంది. అవి నివాస ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. స్నేక్ క్యాచ్చర్స్ (పాములు పట్టుకునే వారిని) వాటిని పట్టుకొని సమీపంలో అటవీ ప్రాంతంలో వదులుతారు.
అవగాహన కల్పిస్తున్నాం
‘జిల్లాలో తరచూ కింగ్ కోబ్రాలు కనిపిస్తుండడంతో అప్రమత్తమయ్యాం అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఆ విష సర్పాలు ఎక్కువగా సంచరించే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామ పరిసరాలు, పొలాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా చేతిలో కర్ర ఉండాలి. ’ అని అని కురుపాం ఫారెస్ట్ రేంజర్ గంగరాజు తెలిపారు.