Share News

ఒడిశా టు ఏపీ

ABN , Publish Date - May 08 , 2025 | 11:41 PM

ఒడిశా నుంచి ఏపీకి కారులో రవాణా చేస్తున్న గంజాయిని సాలూరు రూరల్‌ పోలీసులు, ఈగల్‌ టీం సంయుక్తంగా పట్టుకున్నాయి.

ఒడిశా టు ఏపీ
వివరాలు వెల్లడిస్తున్న సీఐ రామకృష్ణ

- కారులో గంజాయి రవాణా

- 184 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

- వాహనం వదిలేసి ఇద్దరు పరారు

సాలూరు రూరల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ఏపీకి కారులో రవాణా చేస్తున్న గంజాయిని సాలూరు రూరల్‌ పోలీసులు, ఈగల్‌ టీం సంయుక్తంగా పట్టుకున్నాయి. రూ.7లక్షల విలువ చేసే సుమారు 184 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ వివరాలను గురువారం సాలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ పి.రామకృష్ణ విలేకరులకు వెల్లడించారు. దుగ్ధసాగరం జంక్షన్‌ వద్ద సాలూరు రూరల్‌ పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒడిశా నుంచి విజయనగరం వైపు వెళ్తున్న కారును ఈగల్‌ టీంతో కలసి నిలుపుదల చేశారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. దీంతో పోలీసులు కారును పరిశీలించగా 86 ప్యాకెట్లతో ఉన్న సుమారు 184 కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో కారుని సీజ్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించగా ఒడిశా రాష్ట్రం పొట్టంగి బ్లాక్‌ సునాబేడాకు చెందిన నిరుపమా జనా అనే వ్యక్తికి చెందిన కారుగా గుర్తించారు. పోలీసుల తనిఖీల సమయంలో కారును నీరజ్‌కుమార్‌ బెహరా అనే వ్యక్తి నడుపుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారైన వారిని త్వరలో పట్టుకుంటామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గంజాయిని విక్రయించినా, అమ్మకాలు చేసినా, సాగు చేసినా, వినియోగించినా 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతో ఇప్పటి వరకు సాలూరు, పాచిపెంట పోలీస్‌స్టేషన్ల పరిధిలో 2వేల కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఈగల్‌ టీంను సీఐ అభినందించారు.

Updated Date - May 08 , 2025 | 11:41 PM