Share News

ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:05 AM

కర్నూలులో ఇటీవల ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటనను మరిచిపోకముందే సాలూరు సమీపంలో ఏవోబీ ఘాట్‌ రోడ్డులో ఒడిశా ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సు అగ్నికి ఆహుతైంది.

ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం
ఘాట్‌రోడ్డులో దగ్ధమవుతున్న ఒడిశా ఆర్టీసీ బస్సు

- విజయనగరం నుంచి వొమ్మరకోటవెళ్తుండగా ఘటన

- డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

- పరిశీలించిన అధికారులు

సాలూరురూరల్‌/పాచిపెంట/సాలూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఇటీవల ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటనను మరిచిపోకముందే సాలూరు సమీపంలో ఏవోబీ ఘాట్‌ రోడ్డులో ఒడిశా ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే, డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఒడిశా ఆర్టీసీ గత రెండు రోజులుగా విజయనగరం నుంచి వొమ్మరకోటకు ప్రత్యేక బస్సును నడుపుతుంది. ఈ బస్సు విజయనగరంలో గురువారం ఉదయం 5 గంటలకు బయలుదేరింది. ఈ బస్సు సాలూరు చేరుకునే సరికి అందులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ మరో ప్రయాణికుడు ఎక్కాడు. డ్రైవర్‌ సుబీర్‌ హరిజన్‌, కండక్టర్‌ భూపేంద్ర సాహుతో సహా మొత్తం 12 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు కోనవలస దాటిన తరువాత తూర్పు కనుమలు ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తుండగా ఇంజన్‌ వద్ద పొగలు రావడాన్ని డ్రైవర్‌ గుర్తించాడు. కొద్ది దూరం ప్రయాణించి రొడ్డవలస వద్ద ఉదయం 7.20 గంటలకు బస్సును పక్కకు నిలిపి తనిఖీ చేశాడు. డాష్‌బోర్డు వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించాడు. దీంతో ఆయన మంటలు ఆర్పడానికి ఫైర్‌ ప్రోటక్షన్‌తో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. డ్రైవర్‌తో పాటు కండక్టర్‌ కూడా ప్రయాణికులను అప్రమత్తం చేసి వారిని వెనువెంటనే కిందకు దిగేలా చేశారు. ఇంతలో మంటలు బస్సు అంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పాచిపెంట ఎస్‌ఐ వెంకటసురేష్‌ సిబ్బందితో సహా అక్కడకు హుటాహుటిన వెళ్లారు. ఉన్నతాఽధికారులు, సాలూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఘటనా స్థలానికి సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, రూరల్‌ సీఐ పి.రామకృష్ణ చేరుకున్నారు. సాలూరు నుంచి అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను కాపాడిన డ్రైవర్‌ సుబీర్‌ హరిజన్‌ను పలువురు అభినందించారు.

డీజిల్‌ ట్యాంకర్‌ రాకతో ఆందోళన..

ఘాట్‌రోడ్డులో ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమవుతున్న సమయంలో విశాఖ నుంచి జయపురానికి వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఘటనా స్థలానికి సమీపంలోకి రావడంతో అక్కడున్న వారిలో ఆందోళన మొదలైంది. వెంటనే అప్రమత్తమై ఆయిల్‌ ట్యాంకర్‌ను దూరంగా వెనుకకు మళ్లించారు. పోలీసు లు ట్రాఫిక్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. బస్సు కాలిపోతుండడంతో అప్పటికే ఒడిశా, ఏపీల నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు ఆందోళన చెందారు.

పరిశీలించిన ఇరు రాష్ట్రాల అధికారులు..

ఘటనా స్థలాన్నిఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి, ఏఎస్పీ అంకిత సురాన మహావీర్‌, జిల్లా రవాణాశాఖాధికారి దుర్గా ప్రసాద్‌రెడ్డి, సాలూరు ఎంవీ జేవీఎస్‌ఎస్‌ఎస్‌ పరిశీలించారు. ప్రమాదానికి మెకానికల్‌, ఇతర కారణాలున్నయా? అని ఆరా తీశారు. ఒడిశా ఆర్టీసీ విజయనగరం డీఎం రవీంద్రకుమార్‌ బెహరా, జయపురం డీఎం ఈశ్వర్‌ మహాపాత్రో కూడా ఘటనా పరిశీలించారు. బస్సు ఫిట్‌గానే ఉందన్నారు. అయినా ప్రమాదం సంభవించడంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. దగ్ధమైన ఒడిశా ఆర్టీసీ బస్సుకు అన్ని పత్రాలు ఉన్నట్టు సాలూరు రూరల్‌ సీఐ పి.రామకృష్ణ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 12:05 AM