Share News

Kharif Obstacles ఆదిలోనే ఆటంకాలు

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:34 PM

Obstacles Right from the Beginning ఈ ఏడాది ఖరీఫ్‌ పనులకు ఆది నుంచే ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధిక వర్షాలు రైతులను కలవరపరుస్తున్నాయి. ఖరీఫ్‌ కాలం ముంచుకొచ్చినా వ్యవసాయ పనులు మాత్రం చేపట్టలేకపోతున్నారు. ప్రతికూల వాతావరణంతో విత్తనాలు కూడా వేయలేకపోతున్నారు.

Kharif Obstacles   ఆదిలోనే ఆటంకాలు
అధిక వర్షాలతో వెలగవాడలో బురదమయంగా ఉన్న పంట పొలం

  • అధిక వర్షాలతో ముందుకు సాగని పనులు

  • పుడమి తల్లిపై పడని విత్తనాలు

  • ప్రతికూల వాతావరణంతో తలలు పట్టుకుంటున్న రైతులు

పాలకొండ, జూన్‌18(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌ పనులకు ఆది నుంచే ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధిక వర్షాలు రైతులను కలవరపరుస్తున్నాయి. ఖరీఫ్‌ కాలం ముంచుకొచ్చినా వ్యవసాయ పనులు మాత్రం చేపట్టలేకపోతున్నారు. ప్రతికూల వాతావరణంతో విత్తనాలు కూడా వేయలేకపోతున్నారు. ఏటా మే నెలలో వేసవి దుక్కులను పూర్తి చేసి జూన్‌ నెలలో మృగశిర కార్తె ప్రారంభం నుంచి ఖరీఫ్‌ విత్తనాలను జల్లుకొనేవారు. వరితో పాటు పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు ఇతర వాణిజ్య పంటలకు విత్తనాలకు సిద్ధం చేసుకునేవారు. మృగశిర, ఆరు ద్ర కార్తెల్లో 80 శాతం వరకు రైతులు విత్తనాలు వేసేవారు. ఆ తర్వాత అడపాదడపా వర్షాలు కురిసేవి. దీంతో విత్తనాలు మొలకెత్తేవి. అయితే ఈ ఏడాది వేసవి అంతా వర్షాలు కురవడంతో ఖరీఫ్‌ పనులు ముందుకు సాగలేదు. నారుమడుల్లో కలుపు అధికంగా పెరగ్గా భూమి పదును ఇవ్వకపోవడంతో దుక్కులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అసలు విత్తనాలు వేసేందుకు అవకాశాలు లేకపోతుండడంతో ఖరీఫ్‌ పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

2.20 లక్షల ఎకరాల్లో సాగు...

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని 15 మండలాల్లో 2.20 లక్షల ఎకరాల్లో వరితో పాటు వివిధ రకాల పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయాధికారులు సమాయత్తమయ్యారు. 1.79 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో ఎద పద్ధతిలో వరి సాగు చేయనున్నట్టు వారు అంచనా వేశారు. 18 వేల ఎకరాల్లో చిరు ధాన్యాలు, సుమారు 15 వేల ఎకరాల్లోని మెట్ట ప్రాంతాల్లో పత్తి, మరికొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పది శాతం కూడా విత్తనాలు వేయలే..

ఏటా జూన్‌ మొదటి వారంలోనే పత్తి , మొక్కజొన్న, ఇతర చిరుధాన్యాల పంటల విత్తనాలను రైతులు జల్లేవారు. అయితే ఈ ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఆ పనులేవీ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇంతవరకు పది శాతం కూడా ఏ రకమైన విత్తనాలు రైతలు విత్తలేకపోయారు. అధిక వర్షాల కారణంగా విత్తనం కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సాగునీరు పూర్తిస్థాయిలో అందకపోతే నారు మడులకు నష్టం కలిగే అవకాశం ఉందని యోచిస్తున్నారు.

కూలీల కొరత ...

ఖరీఫ్‌లో అధికంగా వేసే వరి పంటకు కూలీల అవసరం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఖరీఫ్‌ పనులన్నీ ఒకేసారి ప్రారంభమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పనులన్నీ ఒకేసారి జరిగితే కూలీల కొరత ఏర్పడక తప్పదు. డిమాండ్‌ దృష్ట్యా వారు అధిక కూలిని డిమాండ్‌ చేస్తే రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

వేసవి పంటను కోల్పోయి...

ఈ ఏడాది రబీ పంటలు పూర్తయిన తర్వాత జిల్లాలోని కొంతమంది రైతులు వేసవి పంట కింద నువ్వు, పెసర, మినుమును సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల్లో ఆయా పంటలు వేశారు. అయితే మే, జూన్‌ నెలల్లో కురిసిన అధిక వర్షాలతో రైతులు ఆయా పంటలను కోల్పోయారు. నువ్వు పంట చిగురించగా, మినుము, పెసరను కోసే పద్ధతి లేకపోవడంతో పొలంలో ఎరువుగా వినియోగించేందుకు మళ్లీ దుక్కులు దున్నారు. మరికొంతమంది రైతులు నీరు పెట్టి దమ్ము చేపట్టారు. ఇలా ఈ ఏడాది రైతులు విభిన్న వాతావరణ పరిస్థితులతో వేసవి పంటను కోల్పోయారు.

విత్తనాలు, ఎరువుల పంపిణీకి సిద్ధం

గరుగుబిల్లి: జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో 26,470 క్వింటాళ్ల మేర పలు రకాల విత్తనాలను సిద్ధం చేశారు. రాయితీపై వాటిని సరఫరా చేయనున్నారు. గిరిజనులకు 90 శాతం రాయితీతో 9,092 క్వింటాళ్లు మేర అందించనున్నారు. చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పచ్చిరొట్ట ఎరువులను సుమారు 1,899 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. 5వేల వరకు పీఎండీఎస్‌ కిట్లును సిద్ధం చేశారు. 30 వేల ఎకరాల్లో వరి పొలం గట్లపై కంది సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో ఖరీఫ్‌కు అవసరమైన సుమారు 45,277 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సిద్ధం చేశారు. రైతుసేవా కేంద్రాలతో పాటు హోల్‌సేల్‌ షాపుల్లో 118 మెట్రిక్‌ టన్నులు, మార్క్‌ఫెడ్‌ పరిధిలో 3,255 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్‌ డీలర్ల దుకాణాలకు 5,939 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌లకు 127 మెట్రిక్‌ టన్నులు, ఆర్‌ఎస్‌కేల పరిధిలో 769 మెట్నిక్‌ టన్నులను అందుబాటులో ఉంచారు.

విత్తనాలు జల్లలేకపోయాం

మృగశిర కార్తెలో విత్తనాలు జల్లితే అధిక దిగుబడి వస్తుందని మా విశ్వాసం. అయితే ఈ ఏడాది అధిక వర్షాలతో వరి విత్తనాలు జల్లలేకపోయాం. నారు మడుల్లో కలుపు, భూములు పదును ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వచ్చే ఆరుద్ర, పునర్వసు కార్తెల్లో అయినా విత్తనాలు జల్లే అవకాశం కలుగుతుందో లేదోనని మదనపడుతున్నాం.

- కనపాక అప్పలనాయుడు, రైతు, ఓని

====================

చెరువులను తలపిస్తున్న పొలాలు

అధిక వర్షాలతో పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. ఖరీఫ్‌ పనులు ముందుకు సాగడం లేదు. ఇదే వాతావరణం కొనసాగితే పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రైతులకు ఈ ఏడాదీ ఖరీఫ్‌ కష్టాలు తప్పేటట్టు లేవు.

- కోట రామినాయుడు, గుడివాడ

=====================

రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు

ఖరీఫ్‌ రైతులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాం. ఎరువులు, విత్తనాలను రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేశాం. రాయితీపై పూర్తిస్థాయిలో రైతులకు వాటిని అందిస్తాం. ప్రకృతి వ్యవసాయంతో పాటు పాటు మిల్లెట్ల సాగును ప్రోత్సహిస్తున్నాం. రాయితీతో కూడిన వ్యవసాయ సామగ్రిని అందించనున్నాం.

కె.రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - Jun 18 , 2025 | 11:34 PM