‘Nuthana’ Buzz ‘నూతన’ సందడి
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:16 PM
‘Nuthana’ Buzz జిల్లాలో ‘నూతన’ సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేరింతలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. మరోవైపు మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి నూతన సంవత్సరానికి అపూర్వ స్వాగతం పలికారు. ఇక యువత ఆనందానికి హద్దుల్లేవ్. ఒకవైపు కేక్‌లను కట్ చేస్తూ పాటలకు లయబద్ధంగా డ్యాన్స్‌లు చేస్తూ 2026 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు.
కేక్‌లు కట్ చేస్తూ డ్యాన్సులు చేసిన యువత
పాలకొండ/సాలూరు రూరల్/వీరఘట్టం/బెలగాం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘నూతన’ సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేరింతలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. మరోవైపు మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి నూతన సంవత్సరానికి అపూర్వ స్వాగతం పలికారు. ఇక యువత ఆనందానికి హద్దుల్లేవ్. ఒకవైపు కేక్‌లను కట్ చేస్తూ పాటలకు లయబద్ధంగా డ్యాన్స్‌లు చేస్తూ 2026 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. బుధవారం రాత్రి 9 గంటలకు మొదలైన సందడి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగింది. పాత ఏడాదికి బైబై చెబుతూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలికారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు కొత్త సంవత్సరం తొలిరోజు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మార్కెట్‌లో బొకేలు, పండ్లు, స్వీట్లు, మొక్కలు, గ్రీటింగ్‌లు విరివిగా కొనుగోలు చేశారు. దీంతో ఆయా షాపులు రద్దీగా మారాయి. ఇక 2026 డైరీల విక్రయాలు కూడా జోరుగా సాగాయి. జిల్లాలో పలు హోటల్స్ బిర్యానీ తదితర వాటికి ఆఫర్స్ ప్రకటించాయి. కూల్‌డ్రింక్ బాటిళ్లు, ఐస్ క్రీమ్‌లు ఇస్తామంటూ ప్రచారం చేశాయి. పలు రెస్టారెంట్లు కూడా కిటకిటలాడాయి. మరోవైపు మద్యం దుకాణాలు రద్దీగా కనిపించాయి. అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగాయి. క్రిస్టియన్లు అర్ధరాత్రి వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాశారు. మొత్తంగా మన్యం వాసుల్లో నూతన జోష్ నెలకొంది. గురువారం తొలిరోజు ఆలయాలకు వెళ్లి కుటుంబ క్షేమం కోసం ప్రత్యేక పూజలు చేసేందుకు జిల్లావాసులు సన్నద్ధమయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి..
సాలూరు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దళాయివలస, లొద్ద, శిఖపరువు జలపాతాలకు బుధవారం విచ్చేశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సవాల్లో గడిపారు. సాలూరు మండలం కొఠియా సమీపంలో ఉన్న దేవ్‌మాలికి కూడా పర్యాటకులు పోటెత్తారు.