Now within the collector's jurisdiction.. ఇక కలెక్టర్ పరిధిలోనే..
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:10 AM
Now within the collector's jurisdiction.. ఒకరి ఆస్తులను మరొకరు మోసపూరితంగా కాజేసి ఫోర్జరీ దస్తా వేజులతో రిజిస్ర్టేషన్ చేసుకోవడంపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై అక్రమంగా రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటే వాటిని రద్దు చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాలు ఇటీవలే అమలులోకి వచ్చాయి.
ఇక కలెక్టర్ పరిధిలోనే..
అక్రమ రిజిస్ర్టేషన్లను రద్దు చేసే అధికారం ఆయనదే
సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన పనిలేదు
ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం
కొత్తవలస, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ఒకరి ఆస్తులను మరొకరు మోసపూరితంగా కాజేసి ఫోర్జరీ దస్తా వేజులతో రిజిస్ర్టేషన్ చేసుకోవడంపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై అక్రమంగా రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటే వాటిని రద్దు చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాలు ఇటీవలే అమలులోకి వచ్చాయి.
గతంలో అక్రమ రిజస్ర్టేషన్‌లను రద్దు చేసే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేది. ఎవరైనా తన ఆస్తిని మరొకరు అక్రమంగా రిజిస్ర్టేషన్ చేయించుకుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. సివిల్ కోర్టులో విచారణ జరిగి తీర్పు వచ్చేసరికి సంవత్సరాల పాటు జాప్యం జరిగేది. ఒకవేళ సివిల్ కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా మళ్లీ పైకోర్టులో అప్పీలు అంటూ మరికొన్ని సంవత్సరాలు జాప్యం జరిగేది. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాటికి చెక్‌పెట్టడమే ధ్యేయంగా ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ తీసుకొచ్చిన విధానంతో జిల్లా కలెక్టర్లు అక్రమంగా చేసుకున్న రిజిస్ర్టేషన్‌లను రద్దు చేసి బాధితులకు న్యాయం చేసే అవకాశాలున్నాయి. ఆస్తిని వేరొకరు అక్రమంగా రిజిస్ర్టేషన్ చేసుకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనిపై విచారించాలని జిల్లా రిజిస్ర్టార్‌కు కలెక్టర్ సిఫార్సు చేస్తారు. రిజిస్ర్టార్ ఆ దస్తావేజులను పరిశీలిస్తారు. ఆధారాలతో కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే కమిటీకి సిఫార్సు చేస్తారు. జిల్లా రిజిస్ర్టార్‌తో పాటు ఇతర జిల్లా అధికారులతో ఈ కమిటీ పనిచేస్తుంది. అక్రమ రిజిస్ర్టేషన్ అని తేలితే ఆ రిజిస్ర్టేషన్‌ను కలెక్టర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రప్రభుత్వం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-- ఆస్తుల అక్రమ రిజిస్ర్టేషన్ల నిరోధానికి జాతీయ రిజిస్ర్టేషన్ చట్టం -1908ను సవరించి ఏపీ యాక్టు అమెండ్‌మెంట్-2023 బిల్లుకు 2023 మార్చి 20న శాసన సభ ఆమోదించింది.
25 వేల ఎకరాల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు
రాష్ట్రంలో 13లక్షల ఎకరాల(ఫ్రీహోల్డ్)లో ఉన్న అసైన్డ్ భూముల్లో 25 వేల ఎకరాలకు రిజిస్ర్టేషన్‌లు జరిగాయి. ఇందులో ఏడు వేల ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ర్టేషన్ జరిగినట్టుగా గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇటువంటి రిజిస్ర్టేషన్‌లను రద్దు చేయడానికి వీలవుతుంది. ముందుముందు మరికొన్ని వేల ఎకరాలలో అక్రమంగా జరిగిన రిజిస్ర్టేషన్‌లను రద్దు చేసేందుకు అవకాశం ఉందంటున్నారు.
ఆ భూములు రిజిస్ర్టేషన్ చేస్తే రిజిస్ర్టార్‌లకూ జైలు
సబ్‌రిజిస్ర్టార్‌లను కూడా అక్రమ రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ప్రభుత్వం బాధ్యులను చేసింది. సబ్ రిజిస్ర్టార్‌లు రిజిస్ర్టేషన్‌లు చేసేటప్పుడు దస్తావేజులను పూర్తిగా పరిశీలించాలి. నిషేధ జాబితాలో ఉన్న భూములను రిజిస్ర్టేషన్‌లు చేసినా, ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ర్టేషన్ చేసినా కోర్టు జప్తులో ఉన్న ఆస్తులను రిజిస్ర్టేషన్‌లు చేసినా ఆ సబ్ రిజిస్ర్టార్లకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈమేరకు సవరించిన చట్టంలో పేర్కొంది. విధి నిర్వహణలో సబ్ రిజిస్ర్టార్‌లు వ్యవహరించిన తీరు కారణంగా క్రయ విక్రయ దారులకు తీవ్రనష్టం జరిగినట్టు రుజువైతే అటువంటి సబ్ రిజిస్ర్టార్‌లకు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించ వచ్చునని తాజా చట్టంలో పేర్కొన్నారు.