మైదానాలు కాదు.. చెరువులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:20 PM
ఈ ఫొటోలను చూసి మైదానాలు అనుకునేరు. ఇవీ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరాయుని, కిష్టప్ప చెరువులు.
పాలకొండ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి)
ఈ ఫొటోలను చూసి మైదానాలు అనుకునేరు. ఇవీ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరాయుని, కిష్టప్ప చెరువులు. గత కొన్నేళ్లుగా పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క పేరుకుపోయి మైదానాల మాదిరిగా తయారయ్యాయి. ఎంతో చరిత్ర కలిగిన వెంకటరాయుని చెరువులో స్థానికులు చెత్తా చెదారాలను పారబోస్తున్నారు. దీనికితోడు గుర్రపుడెక్క, నాచు, ఇతర పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పచ్చిక బయళ్లను తలపిస్తోంది. చెరువులోని చెత్తాచెదారం తొలగించి మత్స్యకార సంఘాలకు చేపలు వేసేందుకు బహిరంగ వేలం వేసినా నగర పంచాయతీకి కొంత ఆదాయం సమకూరుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే విధంగా 40 ఎకరాల విస్తీర్ణం గల కిష్టప్ప చెరువుది కూడా ఇదే పరిస్థితి. ఈ చెరువు ఆక్రమణకు గురవుతుండడంతో పాటు పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క పేరుకుపోయాయి. చెరువు పక్క నుంచి వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ యం త్రాంగం స్పందించి ఈ రెండు చెరువులను బాగుచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.