not interested to plantation ‘మొక్క’బడి
ABN , Publish Date - May 30 , 2025 | 12:03 AM
not interested to plantationఐదేళ్ల వైసీపీ హయాంలో ఉపాధి హామీ పూర్తిగా అవినీతిమయమైంది. ముఖ్యంగా ‘జగనన్న పచ్చతోరణం’లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకం కింద రహదారులకు ఇరువైపులా ఉపాధి నిధులతో మొక్కలు నాటారు. సంరక్షణకు సైతం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆ ఐదేళ్లలో నాటిన చోట నేడు మొక్కలే కనిపించడం లేదు. పెద్ద మొత్తంలో నిధులు మాత్రం డ్రా చేశారు. అవన్నీ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోయినట్టు ఆరోపణులున్నాయి.
‘మొక్క’బడి
జగనన్న పచ్చతోరణాల పేరిట నాడు దోపిడీ
వైసీపీ హయాంలో అవినీతిమయమైన పథకం
ఏడాది అవుతున్నా నిగ్గుతేల్చని వైనం
సరిదిద్దేది ఎప్పుడో?
ఐదేళ్ల వైసీపీ హయాంలో ఉపాధి హామీ పూర్తిగా అవినీతిమయమైంది. ముఖ్యంగా ‘జగనన్న పచ్చతోరణం’లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకం కింద రహదారులకు ఇరువైపులా ఉపాధి నిధులతో మొక్కలు నాటారు. సంరక్షణకు సైతం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆ ఐదేళ్లలో నాటిన చోట నేడు మొక్కలే కనిపించడం లేదు. పెద్ద మొత్తంలో నిధులు మాత్రం డ్రా చేశారు. అవన్నీ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోయినట్టు ఆరోపణులున్నాయి.
రాజాం, మే 29(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనితీరు ఇంకా మెరుగుపడడం లేదు. వైసీపీ వాసనలు పోలేదు. ఇప్పటికీ శాఖలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇటు కూటమి ప్రభుత్వం సైతం ఆ శాఖ అధికారులపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు పరిస్థితి తయారైంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పనుల విషయంలో వేతనదారులందరికీ గిట్టుబాటయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చింది. కానీ ఒకే గ్రామంలో వేతనదారులందరికీ ఒకే రీతిలో వేతనాలు పడడం లేదు. ఒక్కో మేట్ వద్ద పనిచేస్తున్న వారికి ఒక్కో విధంగా వేతనాలు జమ అవుతుండడంతో వివాదాలు ఏర్పడుతున్నాయి.
రోడ్డుకిరువైపులా మొక్కలు..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న పచ్చతోరణం పథకం ప్రారంభించింది. పథకం కింద రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చింది. 2019-20 నుంచి 2021-22 మధ్య జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ పథకాన్ని అమలుచేసింది. దాదాపు 2,200 కిలోమీటర్ల మేర..8,81,414 మొక్కలు నాటినట్టు స్పష్టం చేసింది. కేవలం వాటి సంరక్షణకే రూ.10 కోట్లు వెచ్చించారు. ఇంత ఖర్చు చేసినా ఎక్కడా మొక్కలు కనిపించడం లేదు. కనీసం వాటి ఆనవాళ్లు తెలియడం లేదు. వాస్తవానికి సరిగ్గా నిర్వహణ చేపడితే 85 శాతం మొక్కలు బతకాలి. ఒక వేళ మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా నాటాలి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అటవీ శాఖ నర్సరీల నుంచి 1.06 లక్షల మొక్కలు తెచ్చారు. మిగిలిన వాటిని ప్రైవేటు నర్సరీల నుంచి సేకరించారు. మొక్కల కొనుగోలు, ట్రీగార్డులు, వాటి సంరక్షణకు ఏడాదిలో రూ.4.90 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపారు. జిల్లాలో ఎక్కడా మొక్కలు పెరిగి చెట్లుగా మారిన దాఖలాలు లేవు.
కాసులే కాసులు
జగనన్న పచ్చతోరణం పథకం అప్పటి యంత్రాంగానికి కాసులు కురిపించింది. మొక్కల కొనుగోలు సమయంలో భారీ అవినీతి జరిగింది. ఈ బాగోతంలో కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారుల వరకూ భాగస్వామ్యం అయ్యారు. వాస్తవానికి ఆరు అడుగుల ఎత్తు, రెండేళ్ల వయసున్న మొక్కలనే నాటాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఎక్కడా ఆ పొడవు ఉన్న మొక్కలను నాటలేదు. 3 నుంచి 4 అడుగుల పొడవు ఉన్న మొక్కలను కొనుగోలు చేసి నాటారు. కానీ ఆరు అడుగుల మొక్కను కొనుగోలు చేసినట్టు చూపారు. ఒక్కో మొక్క రూ.98కి కొనుగోలు చేసినట్టు చూపారు. రూ.20 చొప్పున కమీషన్ తీసుకున్నారు.
ఖర్చులిలా..
ఒక్కో మొక్క కోసం గొయ్యి తీసేందుకు రూ.52.90, రవాణాకు రూ.3, అంతర్గత రవాణాకు రూ.2.30, నాటేందుకు రూ.9.12, కంచె కట్టేందుకు రూ.140లు ఖర్చు చేసినట్టు చూపించారు. ఎరువు వేసేందుకు, నీళ్లు పోసేందుకు అనదపు ఖర్చులు చేశారు. అయితే రోడ్డు విస్తరణ చేపట్టిన చోట సైతం మొక్కలు నాటామని లెక్కల్లో చూపడం గమనార్హం. జిల్లాలో జాతీయ రహదారి 516 నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. గంట్యాడ మండలం కొర్లాం, కొండతామరాపల్లి, తాటిపూడి ప్రాంతాల్లో వేలాది మొక్కలు నాటినట్టు చూపారు. తర్వాత రోడ్డు విస్తరణ పనుల్లో అవన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొక్కల కొనుగోలు, సంరక్షణ పేరిట రూ.2 కోట్లు పక్కదారి పట్టాయని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రూ.10 కోట్ల నిధులు గోల్‌మాల్ అయినట్టు తెలుస్తోంది. ఏడాది గడుస్తున్నా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
బాధ్యులపై చర్యలుంటాయి
జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో పచ్చతోరణం పథకం కింద అవినీతి జరిగినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపైనా దృష్టిపెట్టాం. ఇప్పటికే విచారణ జరిగింది. బాధ్యులపై చర్యలు ఉంటాయి. ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత కోసం కఠినంగా వ్యవహరిస్తున్నాం.
శారదాదేవి, డ్వామా పీడీ, విజయనగరం
----------