Atrocity Case ఒక్క అట్రాసిటీ కేసు నమోదు కాలే!
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:21 AM
Not a Single Atrocity Case Registered! ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా పార్వతీపురం మన్యం ఉండడం గర్వకారణమని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా పార్వతీపురం మన్యం ఉండడం గర్వకారణమని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో సమర్థులైన అధికారులు ఉన్నారు. ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం. మన్యంలో ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ కూడా పర్యటించింది. ఎక్కడైనా అట్రాసిటీ కేసు నమోదైతే విచారణ చేపట్టి బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పెదబొండపల్లి గ్రామాన్ని సందర్శించాం. దాదాపు 24 మంది దళిత రైతులకు చెందిన భూములకు ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. దీనిపై కలెక్టర్ దృష్టిసారించి అక్కడ నివసించే దళితులకు న్యాయ సహాయం అందించాలి. విద్య, ఉద్యోగ ఇతర అంశాల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. జీవో నెంబర్ 19 అనుసరించి తగిన చర్యలు చేపట్టాలి. జిల్లాలో దాదాపుగా 97 శాతం దళితులకు శ్మశాన వాటికలు ఉన్నాయి. మిగిలిన వారికి ఇబ్బందులకు లేకుండా భూములు సేకరిస్తాం. జిల్లా స్థాయిలోనే అట్రాసిటీ కేసులు, సమస్యలు పరిష్కరించాలి. వారంతో కనీసం రెండుసార్లు వసతిగృహాలను సందర్శించాలి. విద్యా ప్రమాణాలు, ఆహార నాణ్యత, పారిశుధ్యంపై ఆరా తీయాలి.’ అని తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. 65 శాతం మంది ప్రజలు నేరుగా ఎంపీ, ఎంపీటీసీ, సర్పంచ్, జిల్లా స్థాయి నేతల వద్దకు వచ్చి పిటిషన్లు ఇస్తున్నారని తెలిపారు. అధికారులు ప్రతి పిటిషనర్‌ను కూర్చోబెట్టి మాట్లాడితే దాదాపు 50 శాతం సమస్య అక్కడే పరిష్కారమవుతుందన్నారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసిన సమీక్ష అధికారులకు ఒక వర్క్‌షాపులా ఉపయోగపడిందన్నారు. జిల్లాలో రిజర్వేషన్ పక్కాగా అమలవుతుందని తెలిపారు. బ్యాగ్‌లాగ్ పోస్టుల వివరాలను వారంలోగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ కమిషన్ కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.