No Water Supply 4,100 ఎకరాలకు నీరందట్లే!
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:06 PM
No Water Supply for 4,100 Acres! గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాం మండలంలో గుమ్మడిగెడ్డ ఆనకట్ట పరిస్థితి దయనీయంగా మారింది. దాని నిర్వహణతో పాటు కాలువలను సైతం గాలికొదిలేసింది. పూడికతీత పనులు కూడా చేపట్టకపోవడంతో కాలువలు పిచ్చిమొక్కలతో నిండాయి. ఏళ్లతరబడి పట్టించుకోకపోవడంతో వాటి రూపురేఖలు మారి పోయాయి. ఇక్కడసలు కాలువలు ఉన్నాయా? అన్న పరిస్థితి ఏర్పడింది.
కనీస నిర్వహణకు నోచని గుమ్మడిగెడ్డ ఆనకట్ట
కాలువలనూ పట్టించుకోని వైనం
రిజర్వాయర్ నిర్మాణం హామీ నెరవేర్చలే..
మూడు మండలాల్లో రైతులకు తప్పని ఇబ్బందులు
ఏటా వరుణుడిపైనే ఆధారం
ప్రస్తుతం చందాలేసుకుని కాలువలు బాగుచేసుకుంటున్న ఆయకట్టుదారులు
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు
కురుపాం రూరల్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాం మండలంలో గుమ్మడిగెడ్డ ఆనకట్ట పరిస్థితి దయనీయంగా మారింది. దాని నిర్వహణతో పాటు కాలువలను సైతం గాలికొదిలేసింది. పూడికతీత పనులు కూడా చేపట్టకపోవడంతో కాలువలు పిచ్చిమొక్కలతో నిండాయి. ఏళ్లతరబడి పట్టించుకోకపోవడంతో వాటి రూపురేఖలు మారి పోయాయి. ఇక్కడసలు కాలువలు ఉన్నాయా? అన్న పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా వాటి నుంచి కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండల్లో 4,100 ఎకరాల భూములకు సాగు నీరు అందడం లేదు. దీంతో ఏటా రైతులు వరుణుడిపై ఆధారపడి సాగు చేసుకోవాల్సి వస్తోంది. గతంలో ఉపాధి హామీ పఽథకం నిధులతో అరకొర పనులు చేపట్టినప్పటికీ పలితం లేకపోయింది. కాలువల గుండా నీరు ప్రవహించడం లేదు. దీంతో ఆయకట్టు పరిధిలో గోళ్లవలస, చెక్కవలస, ఈదలవలస, పుటిగుమ్మి, గుజ్జుపాడు, కర్లగండ గ్రామాలకు చెందిన రైతులు చందాలేసుకున్నారు. మొత్తంగా రూ. 1.5 లక్షలతో కాలువల్లో పూడికతీత చేపడుతున్నారు. ప్రస్తుతం ఆనకట్ట నుంచి పూతికవలస, కిచ్చాడ (సుమారు ఐదు కిలోమీటర్లు) వరకు పనులు చేపడుతున్నారు. వాస్తవంగా గుమ్మడిగెడ్డ రిజర్వాయరును రూ.28 కోట్ల అంచనాతో నిర్మిస్తామని, 26 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని వైసీపీ సర్కారు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. దీనిపై స్థానికులు మండి పడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించాలని అన్నదాతలు కోరుతున్నారు. ‘నేను కొత్తగా విధుల్లో చేరా. నా ముందు పనిచేసిన ఇంజనీరు రూ.5 లక్షలతో పూడిక తీత పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. నిధులు మంజూరైతే పనులు చేపడతాం.’ అని ఇరిగేషన్ జేఈ బి. శంకరరావు తెలిపారు.