Share News

Janjavathi! జంఝావతి నీరు అందట్లే!

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:02 AM

No Water from Janjavathi! జంఝావతి నుంచి శివారు భూములకు సాగునీరండం లేదు. దీంతో ఖరీఫ్‌ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఈ నెల 9న ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు. అయినా జియ్యమ్మవలస మండలంలో భూములకు చుక్కనీరు అందని పరిస్థితి నెలకొంది. పిచ్చిమొక్కలు, పూడికలతో ప్రధాన కాలువలన్నీ నిండిపోవడమే ఇందుకు కారణం.

  Janjavathi!  జంఝావతి నీరు అందట్లే!
ఉల్లిభద్ర సమీపంలో పిచ్చి మొక్కలతో నిండిన జంఝావతి కాలువ

  • ఆందోళనలో ఖరీఫ్‌ రైతులు

గరుగుబిల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జంఝావతి నుంచి శివారు భూములకు సాగునీరండం లేదు. దీంతో ఖరీఫ్‌ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఈ నెల 9న ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు. అయినా జియ్యమ్మవలస మండలంలో భూములకు చుక్కనీరు అందని పరిస్థితి నెలకొంది. పిచ్చిమొక్కలు, పూడికలతో ప్రధాన కాలువలన్నీ నిండిపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం వర్షపునీటితోనే కాలువలు దర్శనమిస్తున్నాయి. జంఝావతి ద్వారా ఐదు మండలాల్లోని 75 గ్రామాల పరిధిలో 24,640 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అయితే వివిధ సమస్యలు కారణంగా 9 వేల ఎకరాలకే పరిమితయ్యారు. పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరాకు 450 క్యూసెక్కులు అవసరం. అయితే పైప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి చేరడం లేదు. దీంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. దీనిపై జంఝావతి ప్రాజెక్టు డీఈఈ కె.అప్పలనాయుడును వివరణ కోరగా.. ‘ రైతులకు అసౌకర్యం కలగకుండా సాగునీరు సరఫరాకు చర్యలు చేపడుతున్నాం. ఖరీఫ్‌కు సంబంధించి మొదటిగా 100 క్యూసెక్కులను విడుదల చేశాం. రెండో దఫా 200 క్యూసెక్కులను విడుదల చేస్తాం. ప్రాజెక్టు పరిధిలో ప్రధాన కాలువ 27 కిలో మీటర్లు, 21 డిస్ట్రిబ్యూటరీల పరిధిలో 15 కిలో మీటర్ల మేర ఉంది. 40 శాతం మేర పూడికతీత పనులు చేపట్టాం. ఉపాధి హామీ పథకంలో చిన్నపాటి మరమ్మతులు చేపట్టాం. కొమరాడ మండలం డంగభద్ర ప్రాంతంలోనే కొంతమేర పనులు నిర్వహించాం. ప్రధాన కాలువతో పాటు 21ఎల్‌ డిస్ట్రిబ్యూటరీల పరిధిలో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క నెలకొంది. గతేడాది ఈ పరిస్థితుల్లోనే సాగునీరు విడుదల చేశాం. రైతులకు అవసరమైన అవగాహన కల్పిస్తున్నాం. రూ.54 కోట్లుతో ప్రాజెక్టు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించాం.’ అని తెలిపారు.

Updated Date - Jul 12 , 2025 | 12:02 AM