Share News

No Water నారుకు నీరేదీ?

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:10 AM

No Water for the Sugarcane? జిల్లాలో ఖరీఫ్‌ రైతులకు ప్రకృతి సహకరించడం లేదు. ఒకవైపు వర్షాలు లేక.. సాగునీరు అందక.. మరోవైపు వేసవిని తలపించేలా ఎండలతో వరి నారు, ఎదలు, నాట్లు ఎండిపోతున్నాయి. ఇంజన్లు పెట్టి నీరు తోడుదామన్న చెరువుల్లో చుక్క నీరు కూడాలేదు. దీంతో జిల్లాలో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు.

No Water  నారుకు నీరేదీ?
పాలకొండ మండలం వెలగవాడలో నర్రలు చాచిన ఎదపంట

  • ఎండుతున్న నారుమడులు

  • వేసవిని తలపిస్తున్న ఎండలు

  • ముఖం చాటేసిన వరుణుడు

  • ఆందోళనలో రైతన్నలు

పాలకొండ, ఆగస్టు6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ రైతులకు ప్రకృతి సహకరించడం లేదు. ఒకవైపు వర్షాలు లేక.. సాగునీరు అందక.. మరోవైపు వేసవిని తలపించేలా ఎండలతో వరి నారు, ఎదలు, నాట్లు ఎండిపోతున్నాయి. ఇంజన్లు పెట్టి నీరు తోడుదామన్న చెరువుల్లో చుక్క నీరు కూడాలేదు. దీంతో జిల్లాలో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. నారుమళ్లను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతు న్నారు. ఇప్పటికే పచ్చని పంటలతో ఖరీఫ్‌ కళకళలాడాల్సి ఉంది. ఎరువులు వేసుకోవడం, కలుపు నివారణ మందులు పిచికారీ చేయడంలో జిల్లా రైతులు బిజీగా ఉండాల్సింది. కానీ, వర్షాలు లేక.. కాలువల ద్వారా సాగునీరు అందక ఆగస్టు మొదటివారం గడుస్తున్నా ఇంకాచాలాచోట్ల నాట్లు పడలేదు. మేఘాలు ఊరిస్తున్నాయే తప్ప వర్షాలు కురవడం లేదు. ఉభాలు సీజన్‌ కూడా దాటి పోవడంతో రైతులు కన్నీరు పెట్టు కుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా పడిన వానలకు రైతులు ఎదలు, నాట్లు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటే యడంతో అవి ఎండిపోతున్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ప్రస్తుతం ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మండుతున్న ఎండలకు తోడు ఉక్కపోత తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నారు. అడపాదడపా అవుతున్న ఉబాల పనులను కూడా రైతులు చేయలేకపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లా అంతటా 36 డిగ్రీల దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల కిందట కురిసిన కొద్ది పాటి వర్షాలతో పాటు ప్రాజెక్టుల ద్వారా విడుదలైన సాగునీటితో రైతులు హడావుడిగా ఉబాలు ప్రారంభించారు. అయితే మళ్లీ ఎండల తీవ్రత పెరగడంతో కొన్నిచోట్ల పంటపొలాలు బీటలు వారుతున్నాయి. కొన్నిచోట్ల వేసిన నాట్లు పూర్తిగా కుంగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో కొంతమంది రైతులు ఎద పద్ధతిలో సాగు చేశారు. అయితే నీటితడి లేకపోవడంతో అవి కూడా ఎండిపోతున్నాయి. పంట పొలాల్లో నీరు లేకపోవడంతో కలుపు కూడా ఏపుగా పెరుగుతుంది. భవిష్యత్తులో కలుపు నివారణకు అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుందని రైతులు లబోదిబోమంటున్నారు. మరికొంతమంది రైతులు అందుబాటులో ఉన్న చెరువులు, వాగులు, గెడ్డల ఉంచి ఇంజన్ల సాయంతో పంటలకు నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు పాత ఎడమ, కుడి ప్రధాన కాలువల పరిధిలో శివారు భూములకు సాగునీరు అందడం లేదు. ఒట్టిగెడ్డ, జంఝావతి, వెంగళరాయ సాగర్‌ తదితర ప్రాంతాల శివారు ఆయ కట్టు రైతుల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది.

ఇబ్బందులు పడుతున్నాం

ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. తోటపల్లి కాలువ శివారున ఉన్న మా భూములకు నీరందడం లేదు. తడి లేక పంట భూములు బీటలు వారుతున్నాయి.

- నేరేడుబిల్లి ప్రసాద్‌, పీఆర్‌రాజుపేట

==========================

పనులు చేయలేకపోతున్నాం..

ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాట్లు వేసే మేము ఎండ తీవ్రతకు పనులు చేయలేక పోతున్నాం. మధ్యాహ్న సమయానికి ఇంటి బాట పడుతున్నాం.

- సుగుణమ్మ, ఓని, పాలకొండ మండలం

Updated Date - Aug 07 , 2025 | 12:10 AM