No Water for the Canal? నారుకు నీరేదీ?
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:47 PM
No Water for the Canal? జిల్లాలో ఖరీఫ్ రైతులకు ప్రకృతి సహకరించడం లేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురవడం లేదు. వరుణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. మరోవైపు వేసవిని తలపించేలా ఎండలు.. ప్రాజెక్టుల నుంచి కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందక పోవడంతో వరినారుమడులు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు
వేసవిని తలపిస్తున్న ఎండలు
ఎండుతున్న వరి నారుమడులు
కాపాడుకునేందుకు రైతుల అవస్థలు
గరుగుబిల్లి/వీరఘట్టం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ రైతులకు ప్రకృతి సహకరించడం లేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురవడం లేదు. వరుణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. మరోవైపు వేసవిని తలపించేలా ఎండలు.. ప్రాజెక్టుల నుంచి కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందక పోవడంతో వరినారుమడులు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బీవీ పురం, గరుగుబిల్లి, పెద్దూరు, గొట్టివలస, హిక్కిం వలస, ఉద్దవోలు, దళాయివలస, ఉల్లిభద్ర, కేఆర్‌ఎన్ వలస గ్రామాల్లో ఎండుతున్న వరి ఎదలను పరిరక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. జంఝావతి నుంచి మండలంలో సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు శూన్యం. మండలంలో తోటపల్లి ప్రాజెక్టు ఉన్నా ఈ ప్రాంతాలకు నీరందని పరిస్థితి. కొద్ది రోజుల్లో వర్షం కురవకుంటే పూర్తిగా నారు పాడయ్యే అవకాశం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. సుమారు 6 వేల ఎకరాలకు పైగా వరి ఎదలు వేసిన వారు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక వీరఘట్టం మండలంలో కొందరు అన్నదాతలు సమీపంలో ఉన్న మోటార్ల ద్వారా నీటిని మళ్లించి నారుమడులు ఎండిపోకుండా చూసుకుంటున్నారు. వర్షాలు పడితేనే నారుమడులు దక్కుతాయని, లేకుంటే కష్టమేనని వారు వాపోతున్నారు.