Share News

No Water Flow నీరు పారదు.. ఇక్కట్లు తీరవు!

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:10 PM

No Water Flow, No Relief from Woes! తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుతో పాటు నూతన కుడి ప్రధాన కాలువ పరిధిలో సుమారు 2వేల ఎకరాల్లో భారీగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. దీంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఖరీఫ్‌ రైతులు ధాన్యం విక్రయాల్లో నిమగ్నమయ్యారు. కొద్ది రోజుల్లో రబీ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.

No Water Flow నీరు పారదు.. ఇక్కట్లు తీరవు!
తోటపల్లి ప్రాజెక్టులో పేరుకుపోయిన గుర్రపు డెక్క

  • శివారు భూములకు అందని సాగునీరు

  • ఏటా రైతులకు ఇబ్బందులు

  • నిలిచిన బోటు షికారు

  • నిరాశలో పర్యాటకులు

పార్వతీపురం, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుతో పాటు నూతన కుడి ప్రధాన కాలువ పరిధిలో సుమారు 2వేల ఎకరాల్లో భారీగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. దీంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఖరీఫ్‌ రైతులు ధాన్యం విక్రయాల్లో నిమగ్నమయ్యారు. కొద్ది రోజుల్లో రబీ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. గుర్రపుడెక్కను తొలగించకుంటే వారికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే శివారు ప్రాంత భూములకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. ఏటా వరుణుడిపైనే ఆధారపడి సాగు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తోటపల్లి ప్రాజెక్టు కేంద్రంగా జియ్యమ్మవలస, గరుగుబిల్లి తదితర మండలాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పనులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎత్తిపోతలపై దృష్టిసారించ లేదు. తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులనూ గాలికొదిలేసింది. దీంతో కొన్నాళ్లుగా ఆయా ప్రాంత రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం వారంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని షట్టరు మరమ్మతులకు గురవడంతో కొద్దిరోజులుగా ప్రధాన కాలువ నుంచి సాగునీరు వృథాగా పోతోంది. దిగువ ప్రాంతాలకు నీరు చేరుతుండడంతో గరుగుబిల్లి, వీరఘట్టం మండలాల్లో మొదటి బ్రాంచి పరిధిలోని శివారు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై తోటపల్లి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మన్మథరావును వివరణ కోరగా.. తోటపల్లి ప్రాజెక్టును ఆవరించిన గుర్రపు డెక్కను పూర్తిస్థాయిలో తొలగించేందుకు కృషి చేస్తున్నాం. ఈ సమస్యను ఉన్న తాధికారుల దృష్టిలో పెట్టాం. ఇక షట్టర్ల మరమ్మతు పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామని.. అయితే ఎవరూ ముందుకు రాలేదేని మరో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ వెల్లడించారు. నామినేషన్‌ పద్ధతిపై పనులు చేపట్టేందుకు అనుమతులు కోరామన్నారు.

బోటు షికార్‌కు బ్రేక్‌

గరుగుబిల్లి: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో గుర్రపు డెక్క రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దీంతో బోటు షికారుకు బ్రేక్‌ పడింది. కొద్ది రోజుల కిందట ప్రాజెక్టు పరిధిలోని ఐటీడీఏ పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఇదే సమయంలో నదిలో గుర్రపు డెక్కను తొలగించి గత నెల 27న బోటు షికారుకు పునఃప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఫొటో, వీడియో షెడ్లుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే నది ప్రాంతం మొత్తాన్ని పెద్దఎత్తున గుర్రపుడెక్క ఆవహించడంతో మళ్లీ బోటు షికారు నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు షికారు మరిచి గుర్రపు డెక్కనే చూడాల్సి వస్తోంది. మరికొందరు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. దీనిపై ప్రాజెక్టు జేఈ బి.కిషోర్‌కుమార్‌, ఐటీడీఏ జేఈ తిరుపతిరావులను వివరణ కోరగా ‘ప్రాజెక్టులోని గుర్రపు డెక్కను తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. గుర్రపు డెక్కను శుద్ధి చేసేందుకు రెండు ప్రాంతాల్లో స్థల సేకరణ జరిగింది. కలెక్టర్‌కు ప్రతిపాదనలు నివేదించాం. ఈ విషయాన్ని పర్యాటకశాఖ అధికారులు దృష్టికి తీసు కెళ్లాం. గుర్రపు డెక్కలో చిక్కుకున్న బోట్లును వేరే ప్రాంతానికి తరలిస్తాం. కొద్ది రోజుల్లో బోట్లు తిరిగేలా చర్యలు చేపడతాం.’ అని తెలిపారు.

Updated Date - Dec 14 , 2025 | 11:10 PM