veterinary medicine: సిబ్బంది లేక.. వైద్యం అందక
ABN , Publish Date - May 09 , 2025 | 11:54 PM
veterinary medicine: జిల్లాలో పశువైద్యం మెరుగుపడడం లేదు. ముఖ్యంగా వైసీపీ హయాంలో సంచార పశు వైద్యశాలలు పేరు చెప్పి.. ఉన్న సేవలను నిర్లక్ష్యం చేశారు.
- ఇన్‌చార్జిలతోనే పశువైద్య సేవలు
- శిథిలావస్థలో భవనాలు
- పాడి రైతులకు తప్పని ఇబ్బందులు
- ఇదీ జిల్లాలో పశుసంవర్థక శాఖ పరిస్థితి
రాజాం, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశువైద్యం మెరుగుపడడం లేదు. ముఖ్యంగా వైసీపీ హయాంలో సంచార పశు వైద్యశాలలు పేరు చెప్పి.. ఉన్న సేవలను నిర్లక్ష్యం చేశారు. అటు పశు వైద్య కేంద్రాలను సైతం నిర్వీర్యం చేశారు. అందులో కొత్త నియామకాలు లేవు. పదవీ విరమణ చెందితే అంతే పరిస్థితులు. గ్రామీణ పశు వైద్యసేవలను పశుసంవర్థక శాఖ సహాయకులు, గోపాలమిత్రలతోనే గడిపేశారు. అటు పశు వైద్యశాలలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల వైద్యులు లేక ఇన్‌చార్జిలే సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్, కాంపౌండర్ ఉండాలి. ఉప కేంద్రాల్లో జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్, కాంపౌండర్ ఉండాలి. అయితే జిల్లా వ్యాప్తంగా 10 మంది వరకూ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, 23 మంది పారా వెటర్నరీ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కీలక రంగంపై నిర్లక్ష్యం..
జిల్లాలో వ్యవసాయరంగం తరువాత పశుపోషణ ప్రధాన జీవనోపాధిగా ఉంది. పాడి, కోళ్ల పరిశ్రమలు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకం ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన పశు వైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. వాస్తవానికి ప్రతి మండలంలో మూడు నుంచి నాలుగు పశువైద్యశాలలు ఉండాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. పశు వైద్యశాలలు 30 వరకూ ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఉప కేంద్రాలు నడుస్తున్నాయి. రేగిడి మండలం సంకిలిలో పశువైద్యశాలలో వైద్యుని పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ రేగిడి పశువైద్యాధికారి ఇన్‌చార్జిగా ఉన్నారు. రెండు ఆస్పత్రులు ఒకరే చూస్తుండడంతో సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు.
ఆ భవనాల్లో భయంగా..
జిల్లాలో చాలావరకూ పశువైద్యశాల భవనాలు పూర్తిగా శిథిలమయ్యాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. రామభద్రపురం, గుర్ల, పాతరేగ, రొంపల్లి, ఆరికతోట, రేగిడి, సంకిలి తదితర ప్రాంతాల్లోని పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో పశుసంవర్థక శాఖలో ఒకచోట విధులు, మరోచోట జీతాలు అన్నట్టు పరిస్థితి ఉంది. రేగిడి మండలం ఉంగరాడ, దేవుదళకు గ్రామీణ పశువైద్యశాలల్లో సహాయకులు లేరు. ఇక్కడ ఉన్న వారిని వేరేచోటకు పంపించారు. వంగరకు ఇన్‌చార్జిగా గుళ్లసీతారాంపురం పశువైద్యుడ్ని ఇన్‌చార్జిగా నియమించారు. కానీ ఆయన రెండుచోట్ల విధులు నిర్వహించలేకపోతున్నారు. ఇక్కడ అటెండరు, పశువైద్య సహాయకుడి పోస్టు ఖాళీగా ఉంది. రాజులగుమ్మాడలో సహాయకుడ్ని డిప్యూటేషన్‌పై పంపడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
జిల్లాలో అక్కడక్కడా పశువైద్యుల కొరత ఉంది. సిబ్బంది కొరత ఉన్నచోట డిప్యూటేషన్లపై నియమిస్తున్నాం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. భవనాలు శిథిలం కావడంతో కొత్త వాటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
-వైవీ రమణ, పశుసంవర్థక శాఖ జేడీ, విజయనగరం