Share News

No Repairs, No Replacements! మరమ్మతులు చేయరు.. కొత్తవి వేయరు!

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:04 AM

No Repairs, No Replacements! జిల్లాలోని వివిధ మండలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. రోజులు గడుస్తున్నా.. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం లేదు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దీంతో రైతులకు సాగు నీటి కష్టాలు తప్పడం లేదు.

No Repairs, No Replacements!      మరమ్మతులు చేయరు.. కొత్తవి వేయరు!
చిలకాంలో మరమ్మతులకు నోచని ట్రాన్స్‌ఫార్మర్‌

  • విద్యుత్‌ సరఫరా లేక పొలాల్లో సాగునీటికి ఆటంకం

  • రైతులకు తప్పని అవస్థలు

  • స్పందించని అధికారులు

గరుగుబిల్లి, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ మండలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. రోజులు గడుస్తున్నా.. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం లేదు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దీంతో రైతులకు సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం పార్వతీపురం, పాలకొండ డివిజన్ల పరిధిలోని పంట పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు అధికంగా మరమ్మతులకు గురవుతున్నాయి. పిడుగులు, వర్షాలు, చెట్ల కొమ్మలతో పాటు అధిక లోడు కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు మూలకు చేరాయి. నెలలు గడుస్తున్నా వాటిని మార్పు చేయడం లేదు. దీంతో విద్యుత్‌ సరఫరా కాక పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో మోటార్ల సాయంతోనైనా పంట పొలాలకు నీటిని మళ్లిద్దామను కున్న రైతులకు నిరాశే మిగులుతోంది. వేసవిని తలపించేలా ఎండలు ఠారెత్తిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగూరు, కుదమ సబ్‌స్టేషన్ల పరిధిలో తోటపల్లి, నాగూరు, రావివలస, చిలకాం, కారివలసతో పాటు పలు గ్రామాల్లో సుమారు 25 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. గత రెండు నెలల కిందట కురిసిన వర్షాలు, ఉరుములు, మెరుపుల కారణంగా జిల్లాలోని ప్రతి మండలంలో 20కి పైగా మూలకు చేరాయి. దీంతో మోటార్ల సాయంతో పంటలు పండించే వారికి ఇబ్బందులు తప్పడం లేదని తురకనాయుడువలసకు చెందిన రైతులు ఎం.శివున్నాయుడు, మరిశర్ల అప్పలనాయుడు తదితరులు వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు మార్పు చేయాలని పలు దఫాలు అధికారులను కోరినా నేటికీ ఎటువంటి స్పందన లేదన్నారు. నీరు లేక వరి ఉబాలు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమస్యను సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరుకాలేదని చెబుతున్నారు. మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్ల సమాచారాన్ని ఉన్నతాధికారులకు వివరించామని తెలియజేస్తున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:04 AM