No Quarry in Our Area మా ప్రాంతంలో క్వారీ వద్దు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:11 AM
No Quarry in Our Area పార్వతీపురం మండలం కారాడవలస- పెద్దబొండపల్లి గ్రామాల మధ్య క్వారీ ఏర్పాటు చేయొద్దని ఆ ప్రాంతవాసులు తేల్చి చెప్పారు. గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని నినదించారు.
పార్వతీపురం రూరల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం కారాడవలస- పెద్దబొండపల్లి గ్రామాల మధ్య క్వారీ ఏర్పాటు చేయొద్దని ఆ ప్రాంతవాసులు తేల్చి చెప్పారు. గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని నినదించారు. బుధవారం కారాడవలస సమీపంలో రెవెన్యూ, పర్యావరణ శాఖాధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్థులు క్వారీ నిర్వహణకు అనుమతులిస్తే సహించేది లేదని ముక్తకంఠంతో తెలిపారు. గ్రానైట్ తవ్వకాలు చేపట్టే ప్రాంతం తమ గ్రామాలకు సమీపంలో ఉందని, గ్రామస్థులు అనారోగ్యం పాలవ్వడంతో పాటు మేతకు వెళ్లే మూగజీవాలు మృత్యువాత పడే అవకాశం ఉందని వెల్లడించారు. పంటలను కూడా నష్టపోతామన్నారు. అనంతరం క్వారీ నిర్వహణ వద్దంటూ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు. ప్రజల అభిప్రాయాన్ని ఉన్నతాధి కారులకు తెలియజేస్తామని డీఆర్వో హేమలత తెలిపారు. ఆమె వెంట రూరల్ ఎస్‌ఐ సంతోషి తదితరులు ఉన్నారు.