No Phone… Love the Book! ఫోన్ వద్దు...పుస్తకం ముద్దు
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:46 PM
No Phone… Love the Book! నేటి సమాజంలో యువత, పిల్లలు ఎక్కువుగా మొబైల్ ఫోన్లకు హత్తుకుపోతున్నారని, పుస్తక పఠనంతో మేథస్సు మెరగవుతుందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘ఫోన్ వద్దు.. పుస్తకం ముద్దు’ అని తెలిపారు. మంగళ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు.
కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
బెలగాం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి) : నేటి సమాజంలో యువత, పిల్లలు ఎక్కువుగా మొబైల్ ఫోన్లకు హత్తుకుపోతున్నారని, పుస్తక పఠనంతో మేథస్సు మెరగవుతుందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘ఫోన్ వద్దు.. పుస్తకం ముద్దు’ అని తెలిపారు. మంగళ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ పార్వతీపురంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. వయసు, హోదాతో సంబంధం లేకుండా పుస్తక పఠనం ముందు అందరూ పిల్లలే అని గుర్తు చేశారు. జిల్లాలో గొప్ప కవులు, రచయితలు ఉన్నారని, సాహితీవేత్తలకు జిల్లా పుటినిల్లు అని తెలిపారు. పది రోజుల పాటు జరిగే ఈ పుస్తక మహోత్సవాన్ని సాహిత్య ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలి
నిర్దేశిత గడువులోగా రెవెన్యూ అధికారులు జిల్లాలో రీ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ‘ తహసీల్దార్ల కార్యాలయాల రూపు రేఖలు మారాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. సబ్ కలెక్టర్లు మండలాల్లో విస్తృతంగా పర్యటించాలి. కుల ధ్రువీకరణ పత్రాలు వీలైనంత త్వరగా మంజూరు చేయాలి. చెరువులు, రహదారులు ఆక్రమణదారులపై విధానపరమైన చర్యలు తీసుకోవాలి’. అని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.
వివక్ష లేకుండా చర్యలు
సమాజంలో స్త్రీ, పురుషలిద్దరూ సమానమేనని, వివక్ష లేకుండా పటిష్ట చర్యలు చేపట్టి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో జెండర్ సమానత్వం కోసం చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జెండర్ సమానత్వంపై పాఠశాల, కళాశాలల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈవీఎం గోదాము పరిశీలన
పార్వతీపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా అక్కడ పరిస్థితిని గమనించారు. గోదాముకు వేసిన సీళ్లు, ఈవీఎంల రక్షణ, భద్రతను పరిశీలించారు. పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఆర్వో కె.హేమలత, తహసీల్దార్ ఎం.సురేష్ తదితరులు ఉన్నారు.