Share News

Construction Halt!అనుమతులు రాక.. కట్టుకోలేక!

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:48 PM

No Permissions… Construction Comes to a Halt! పక్కా గృహాలు మంజూరయ్యాయని ఆ గ్రామ గిరిజనులు ఎంతో సంబరపడ్డారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సొంతింటి కలను నెర వేర్చుకుందామని ఆశపడ్డారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు.

  Construction Halt!అనుమతులు రాక..  కట్టుకోలేక!
ఇంటి నిర్మాణం కోసం గిరిజన లబ్ధిదారులు ఖాళీగా వదిలేసిన స్థలం

  • పూరిపాకలు తొలగించి.. పనులకు శ్రీకారం చుట్టిన లబ్ధిదారులు

  • ఆ ప్రాంతంలో ఆర్‌ఎఫ్‌లో ఉందంటూ అటవీశాఖ అభ్యంతరం

  • ఐదు నెలలు గడిచినా.. తేలని పంచాయితీ

  • నిలువనీడ లేక గిరిపుత్రుల అవస్థలు

  • ఇదీ పీవీటీజీ గ్రామం నారాయణగూడలో పరిస్థితి

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

సీతంపేట రూరల్‌, డిసెంబరు8(ఆంధ్రజ్యోతి): పక్కా గృహాలు మంజూరయ్యాయని ఆ గ్రామ గిరిజనులు ఎంతో సంబరపడ్డారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సొంతింటి కలను నెర వేర్చుకుందామని ఆశపడ్డారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు. అధికారుల హామీతో ఉన్న పూరిళ్లను తొలగించి గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన వారికి నిరాశే ఎదురైంది. అనుమతుల పేరుతో అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. దీంతో కొన్నినెలలుగా నారాయణగూడ గిరిజనులు నిలువనీడ లేక నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించక పోవడంపై ఆ గ్రామస్థులు మండిపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

సీతంపేట ఏజెన్సీలో మారుమూల పీవీటీజీ గ్రామమైన నారాయణగూడలో 39 గిరిజన కుటుంబాలు(ప్రిమెటివ్‌ విలేజ్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌-పీవీటీజీ) గడిచిన 20ఏళ్లుగా నివసిస్తున్నాయి. 2023-24లో పీఎం జన్‌మన్‌ పథకం కింద ఆ గ్రామంలోని 13మందికి గృహాలు మంజూరయ్యాయి. రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ అధికారులు లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నివసిస్తున్న స్థలంలో ఇంటి నిర్మాణానికి పునాదులు తవ్వుకుంటే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. దీంతో పట్టలేని ఆనందంతో ఆ గ్రామానికి చెందిన సవర గంగమ్మ, గణేష్‌, దుర్గారావు, చిరంజీవి, జక్కమ్మ, మొఖలింగం, జగపతి, లక్కమ్మతో పాటు మరికొందరు తాము నివసిస్తున్న పూరి పాకలను తొలగించి ఇంటి నిర్మాణానికి సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు నారాయణగూడ గ్రామానికి చేరుకున్నారు. ఆర్‌ఎఫ్‌(రిజర్వ్‌ ఫారెస్ట్‌) పరిధిలో ఈ ప్రాంతం ఉందని అభ్యంతరం తెలిపారు. గిరిజన లబ్ధిదారులతో వాదనకు దిగారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నా అటవీశాఖ అనుమతులు ఉండాలని ఫారెస్ట్‌ అధికారులు గట్టిగా చెప్పడంతో ఇళ్ల పనులకు బ్రేక్‌ పడింది. సుమారు ఐదు నెలలు కావస్తున్నా.. ఇంకా అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో నారాయణగూడ గ్రామ గిరిజనులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.

వినతులు ఇచ్చినా..

ఇళ్ల నిర్మాణాలకు అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో గిరిజనులు సొంత నిధులను సమకూర్చుకొని చిన్నపాటి పూరిపాకలు, రేకులషెడ్డులను వేసుకున్నారు. గోడలుగా పరదాలను కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. ఇదిలా ఉండగా నారాయణగూడలో మౌలిక వసతులు కొరవడ్డాయి. పక్కా గృహాలతో పాటు తాగునీరు, అంతర్గత సీసీ రహదారులు, వీధిలైట్లు లేవు. ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రం కూడా లేకపోవడంతో చిన్నారులు సమీపంలో ఉన్న లోకొత్తవలసకు వెళ్లాల్సి వస్తోంది. రేషన్‌ సరుకుల కోసం సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుసిమి జీసీసీ డీఆర్‌ డిపోనకు చేరుకోవాల్సి వస్తోంది. నారాయణగూడకు పక్కా రహదారి కూడా లేదు. సీతంపేట నుంచి ఈ గ్రామానికి చేరుకోవాలంటే పాలకొండ మీదుగా లోకొత్తవలస, గదబవలస దాటి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. అదే కొండపై నుంచి అయితే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుసిమి వరకు కాలినడకన వెళ్లాలి. అక్కడి నుంచి సీతంపేటకు మరో పది కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సి ఉంది. తమ సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు ఐటీడీఏ, హౌసింగ్‌, రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని గ్రామానికి చెందిన సవర వీరన్న,గణేష్‌, సవర సింహాచలం ఆవేదన వ్యక్తం చేశారు.

పరదాలే గోడలుగా..

‘మా గ్రామం ఆర్‌ఎఫ్‌(రిజర్వ్‌ ఫారెస్ట్‌)లో ఉందని ఎవరూ చెప్పలేదు. అయితే అధికారుల మాటలు నమ్మి ఉన్న ఇంటిని తొలగించి.. నేడు నిలువనీడ కోసం అల్లాడుతున్నాం. పరదాలనే గోడలుగా మార్చుకొని జీవిస్తున్నాం.’ అని హౌసింగ్‌ లబ్ధిదారుడు సవర సింహాచలం తెలిపాడు.

అధికారులు స్పందించాలి

‘ ఐదు నెలలు గడుస్తున్నా.. అటవీశాఖ నుంచి అనుమతులు రాలేదు. అధికారులు భరోసా ఇస్తేనే ఉన్న ఇంటిని తొలగించి, పక్కా గృహాల నిర్మాణాలకు సిద్ధపడ్డాం. కానీ నేడు నిలువనీడ కరువై చిన్న పిల్లలతో అల్లాడుతున్నాం. పురిపాకలు, రేకుల షెడ్డుల్లో జీవనం సాగిస్తున్నాం. దీనిపై అధికారులు స్పందించాలి.’ అని గ్రామానికి చెందిన లబ్ధిదారు సవర సుక్కమ్మ కోరింది.

అనుమతులు రావాల్సి ఉంది

‘నారాయణగూడ గ్రామం శ్రీకాకుళం జిల్లా ఆర్‌ఎఫ్‌(రిజర్వ్‌ ఫారెస్ట్‌) పరిధిలో ఉంది. అటవీశాఖ అభ్యంతరాలు తెలపడంతో ఆ గ్రామస్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడ గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ఎస్‌డీఎల్‌సీ(సబ్‌ డివిజనల్‌ కమిటీ) నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఎల్‌డీఎల్‌సీ ఆమోదం తెలిపిన తరువాత డీఎల్‌సీ(డివిజనల్‌ లెవెల్‌ కమిటీ) నంచి అనుమతులు పొందాల్సి ఉంది. ఇప్పటికే సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల పరిధిలో ఆర్‌ఎఫ్‌లో ఉన్న 208 గృహాలకు క్లియరెన్స్‌ ఇప్పించాం. ఇక సీతంపేట మండలంలో ఆర్‌ఎఫ్‌లో ఉన్న 58 గృహాలకు క్లియరెన్స్‌ ఇప్పిం చాల్సి ఉంది. ’ అని రెవెన్యూ డీటీ వెంకట్రావు తెలిపారు.

ఎఫ్‌ఆర్‌వో ఏమన్నారంటే..

‘ నారాయణగూడ గ్రామం ఆర్‌ఎఫ్‌లో ఉంది. అక్కడ గృహ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలులేదని గిరిజనులకు చెప్పాం. ఎస్‌డీఎల్‌సీ క్లీయరెన్స్‌ ఇచ్చిన తరువాత డీఎల్‌సీలో పెట్టి ఆ గ్రామ గిరిజన లబ్ధిదారులకు అనుమతులు మంజూరు చేస్తాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.’ అని పాలకొండ అటవీశాఖ ఎఫ్‌ఆర్‌వో రామారావు తెలిపారు.

Updated Date - Dec 08 , 2025 | 11:48 PM