No one gives away fields. పొలాలను ఇచ్చేది లేదు
ABN , Publish Date - May 29 , 2025 | 12:05 AM
No one gives away fields.‘మా పొలాలను ఇచ్చేది లేదు... మాకు ఎటువంటి సర్వేలు, సమావేశాలు పెట్టవద్దు.. అధికారులందరూ కొండదిగి వెంటనే వెళ్లిపోండి’ అంటూ మారిక గ్రామ గిరిజనులు ఖరాకండిగా చెప్పారు. తమ మనోభావాలను అర్థం చేసుకోవాలని గిరిజనులందరూ బుధవారం ముక్తకంఠంతో కోరారు.
పొలాలను ఇచ్చేది లేదు
సర్వే అధికారులను అడ్డుకున్న మారిక గిరిజనులు
తాళ్లతో కట్టి బంధించాలనుకున్న ప్రజలు
వేపాడ, మే 28 (ఆంధ్రజ్యోతి):‘మా పొలాలను ఇచ్చేది లేదు... మాకు ఎటువంటి సర్వేలు, సమావేశాలు పెట్టవద్దు.. అధికారులందరూ కొండదిగి వెంటనే వెళ్లిపోండి’ అంటూ మారిక గ్రామ గిరిజనులు ఖరాకండిగా చెప్పారు. తమ మనోభావాలను అర్థం చేసుకోవాలని గిరిజనులందరూ బుధవారం ముక్తకంఠంతో కోరారు. గిరిశిఖర గ్రామంగా గుర్తింపు పొందిన మారిక గ్రామ భూముల్లో అదానీ పవర్ ప్రాజెక్టు వస్తోందని తెలుసుకున్న గిరిజనులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ అధికారులకు విన్నపాలు ఇస్తున్నారు. తమ భూములను తీసుకోవద్దని కోరుతున్నారు. తాజాగా సామాజిక సర్వే పేరుతో అధికారులు, అదానీ కంపెనీ సిబ్బంది పోలీసులతో బుధవారం గ్రామానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న మారిక గిరిజన యువకులు గ్రామానికి సమీపంలో మార్గమధ్యలో వారిని అడ్డుకున్నారు. కొండదిగి వెంటనే వెళ్లి పోవాలని నినాదాలు చేశారు. గిరిజనులు కొండపైనే బతకగలరని, ప్రకృతి వనరులే తమకు సంపదని, కొండను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చేసేదిలేక అధికారులందరూ వెనక్కివెళ్లిపోయారు. అధికారులను అడ్డుకున్న వారిలో గిరిజన యువకులు జాలారి వీర్రాజు, గమ్మెల బాబూరావు, అప్పలనాయుడు, సోమేష్, శ్రీను, ఆసు వెంకటరావు, గణేష్, దేవుడు, బుజ్జిబాబు తదితరులు ఉన్నారు. అధికారుల్లో తహసీల్దార్ రాములమ్మ, డీటీ సన్యాసినాయుడు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామలక్ష్మి, వల్లంపూడి ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉన్నారు.
సామాజిక ప్రభావ అంచనా సర్వేకు వెళ్లాం
పి.దేవరాజు,ఎస్‌ఐఏ నిపుణుడు, అధికారుల బృంద సభ్యుడు
విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మారిక గిరిజన గ్రామాన్ని ఎంపిక చేసింది. అందుకు 213.80 ఎకరాలు అవసరం. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం ముందుగా సామాజిక ప్రభావ అంచనా నివేదికను(ఎస్‌ఐఏ) తయారు చేయాల్సి ఉంది. ఇందుకోసం బుధవారం గ్రామానికి వెళ్లాం. వారితో మాట్లాడాం. నూతన భూ సేకరణ చట్టం గురించి వివరించి సర్వేకు సహకరించాలని కోరాం. రైతులు, గ్రామ పెద్దలు, నిర్వాసితులు ఎస్‌ఐఏ టీమ్ సభ్యులను, రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు.