No Maoist మన్యంలో మావోయిస్టుల ప్రభావం లేదు!
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:33 AM
No Maoist Influence in the Forest Region జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
పార్వతీపురం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... ‘ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన తర్వాత జిల్లా పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి, రాష్ట్రంలో పలుచోట్ల మావోలు పోలీసులకు చిక్కడం, వారి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం తదితర పరిణమాలతో మన్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం. రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, గిరిజన, మైదాన ప్రాంతాల్లో వాహనాలను చెక్ చేస్తున్నాం. మన్యంలో మావోయిస్టుల జాడ లేనప్పటికీ పోలీస్ యంత్రాంగం అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతుంది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పర్యటించరాదని ప్రజాప్రతినిధులకు సూచిం చాం. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశాం. మారుమూల ప్రాంతాలకు వెళ్తున్న నైట్‌హాల్ట్ ఆర్టీసీ బస్సులను అక్కడ ఉంచొద్దని ఆర్టీసీకి సూచించాం.’ అని తెలిపారు. జిల్లాలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు.
క్రైమ్ స్పాట్ వాహనాలతో దర్యాప్తు వేగవంతం
బెలగాం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దర్యాప్తు వేగవంతానికి, నేరస్థులను పట్టుకునేందుకు, ప్రత్యేక క్రైమ్ స్పాట్ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ స్పాట్ వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాల్లో ఫోరెన్సిక్ కిట్లు, డిజిటల్ డాక్యుమెంటేషన్ పరికరాలు, ప్రాథమిక సాక్ష్య సేకరణ సాధనాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రజా భద్రత కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్‌ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.