No Loans… No Trainings! రుణాల్లేవు.. శిక్షణలు లేవు!
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:11 PM
No Loans… No Trainings! బీసీల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే సీతంపేట మండలంలో మాత్రం పలువురు బీసీలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇటీవల కేటాయించిన సబ్సీడీ రుణాల మంజూరులో కూడా గందరగోళం నెలకొంది.
కలగా మారిన కుట్టు శిక్షణలు
వెనక్కి వెళ్లిపోయిన మిషన్లు
అధికారుల నిర్లక్ష్యంపై పెదవి విరుస్తున్న ప్రజలు
సీతంపేట రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీసీల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే సీతంపేట మండలంలో మాత్రం పలువురు బీసీలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇటీవల కేటాయించిన సబ్సీడీ రుణాల మంజూరులో కూడా గందరగోళం నెలకొంది. సీతంపేట మండలంలో సుమారు 50 వేలకు పైగా జనాభా ఉండగా.. వీరిలో బీసీలు 15శాతం మంది ఉన్నారు. గత వైసీపి పాలనలో వారికి ఎటువంటి పథకాలు అందలేదు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన బీసీ సబ్సిడీ రుణాల్లో వారికి కోత పడింది. మంజూరు చేసిన నాలుగు సబ్సిడీ రుణాల కోసం 195 మంది బీసీలు దరఖాస్తులు చేసుకోగా.. అధికారులు నలుగురిని ఎంపిక చేసి.. బ్యాంక్‌లకు సిఫారసు చేశారు. అయితే ఈ అరకొర రుణాలు కూడా ఇంత వరకు లబ్ధిదారులకు మంజూరు కాలేదు..
కుట్టు శిక్షణ హుళుక్కే..
బీసీ మహిళలు, నిరుద్యోగ యువతలు కుటుంబపోషణలో భాగం కావాలనే సదుద్దేశంతో కూటమి సర్కార్ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా 90రోజుల పాటు కుట్టు శిక్షణ అందించేందుకు సన్నాహాలు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని ప్రారంభించారు. అయితే పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల్లో కుట్టు శిక్షణల కోసం గడిచిన మూడు నెలల కిందట అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పాలకొండ, వీరఘట్టం, భామిని మండలాల్లో మహిళల కోసం ప్రారంభించిన కట్టు శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. కానీ సీతంపేట మండలంలో మాత్రం కుట్టు శిక్షణలు కలగానే మారాయి. గడిచిన మూడు నెలల కిందట సీతంపేటకు కుట్టుమిషన్‌లు చేరాయి. అయితే శిక్షణపై మండల స్థాయి అధికారులు ఎవరికి ముందస్తుగా తెలియపరచలేదు. దీంతో కేవలం 12మంది మహిళలు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. నిబందనల మేరకు 90మంది వరకు మహిళలకు కుట్టులో శిక్షణలు ఇస్తారు. ఎవరికైతే 75శాతం హాజరు ఉంటుందో వారికి శిక్షణ తరువాత కుట్టుమిషన్‌ను కూడ ఉచితంగా అందజేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రాంత మహిళలకు శాపంగా మారింది. సీతంపేట కేంద్రానికి వచ్చిన కుట్టుమిషన్‌లను సైతం వెనక్కి పంపించేశారు. దీంతో బీసీ మహిళల కోసం రూపొందించిన ఈ పథకం కూడా ఈ ప్రాంత మహిళలకు దక్కకుండా పోయింది.
డిప్యూటీ ఎంపీడీవో ఏమన్నారంటే...
‘బీసీ మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుట్టు శిక్షణా పథకంపై గతంలో ప్రచారం చేశాం. అయితే ఆశించిన స్థాయిలో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభం కాలేదు. బీసీ వెల్ఫేర్ అధికారుల ఆదేశాల మేరకు శిక్షణల కోసం పంపిన కుట్టు మిషన్లను వెనక్కి పంపించాం.’ అని డిప్యూటీ ఎంపీడీవో కె.సత్యం తెలిపారు.
శిక్షణ ఇచ్చుంటే బావుండేది
కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి ఉంటే బావుండేది. శిక్షణలో మెలకువలు నేర్చుకొని సొంతంగా పని చేసుకునేవాళ్లం. కుటుంబపోషణలో మా వంతు సహకారం అందించే అవకాశం ఉండేది. ప్రభుత్వం మళ్లీ ఇటువంటి అవకాశం కల్పిస్తే కుట్టుశిక్షణ పొందేందుకు వెళ్తా.
- ఉష, కొత్త పనుకువలస
===============================
శిక్షణపై సమాచారం లేదు..
సీతంపేట మండల కేంద్రంగా మహిళలకు ఇస్తున్న ఉచిత కుట్టు శిక్షణా తరగతులపై ఎటువంటి సమాచారం లేదు. తెలిస్తే దరఖాస్తు చేసుకునే వాళ్లం. ఇప్పటికైనా శిక్షణ ఇస్తే నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
- టి.ఢిల్లీశ్వరి , సీతంపేట