లస్కర్లు లేరు.. మరమ్మతులు లేవు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:00 AM
తోటపల్లి ఎడమ కాలువ సబ్‌చానెల్ పరిధిలో కాలువలపై పర్యవేక్షణకు పూర్తిస్థాయిలో లస్కర్లు లేకపోవడం, మరమ్మతులు లేకపోవడంతో సక్రమంగా నీరందక రైతులు ఇబ్బందులుపడుతున్నారు. కాలువకు అడ్డంగా రావివలస వద్ద చెట్టు కూలిపోయింది.
వీరఘట్టం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ఎడమ కాలువ సబ్‌చానెల్ పరిధిలో కాలువలపై పర్యవేక్షణకు పూర్తిస్థాయిలో లస్కర్లు లేకపోవడం, మరమ్మతులు లేకపోవడంతో సక్రమంగా నీరందక రైతులు ఇబ్బందులుపడుతున్నారు. కాలువకు అడ్డంగా రావివలస వద్ద చెట్టు కూలిపోయింది.దీనికితోడు నడిమికెల్ల వద్ద కల్వర్టు పాడవడంతో షట్టర్‌పైకి ఎత్తాలన్నా, కిందకు దించాలన్నా వీలుపడడంలేదు. వీటి పర్యవేక్షణకు లస్కర్లు లేకపోవడంతో ఏటా శివారు ఆయకట్టు రైతులకు అగచాట్లు తప్పడం లేదు. కనీసం షట్టర్ వద్ద ఉన్న సిమెంట్ దిమ్మలు సైతం మరమ్మతులు చేయించలేదు. దీంతో మండలంలో కడకెల్ల, నడిమికెల్ల, విక్రంపురం, చిట్టిపుడివలస, నడుకూరు, కిమ్మి, కొట్టుగుమ్మడ, గడగమ్మ గ్రామాలకు తోటపల్లి ఎడమ కాలువ సబ్‌చానెల్ ద్వారా సాగు నీరు పూర్తిస్థాయిలో అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్ప టికైనా ఉన్నతాధికారులు స్పందించి షట్టర్లు మరమ్మతులు చేయిం చాలని, లస్కర్లను నియమించాలని రైతులు కోరుతున్నారు. కాగా కుడి, ఎడమ కాలువలకు 38 మంది లస్కర్లు ఉండాలని, కాని ప్రస్తుతం ఐదుగురు ఉన్నారని తోటపల్లి ఏఈ డీవీ రమణ తెలిపారు. ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు.